జనసేనలో చేరికల జోరు షురూ అవుతోంది.!

టిక్కెట్లు ఖాయమవుతున్నాయా.? అందుకే, నేతలు కాస్త ధైర్యంగా ముందుకొస్తున్నారా.? జనసేనలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నాయకుల సంఖ్య రానున్న రోజుల్లో గణనీయంగా పెరగబోతోందా.? అంటే, ఔననే అనుకోవాలేమో.!

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, కొద్ది రోజుల క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. అనకాపల్లిలో నిర్వహించే బహిరంగ సభ వేదికగా ఆయన జనసేనలో చేరబోతున్నారు. అయితే, మధ్యలో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చి, ఆయన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంతో కొంత గందరగోళం ఏర్పడింది.

కొణతాల మాత్రం తాను జనసేనలోనే చేరతానని పునరుద్ధాటించడంతో, ప్రస్తుతానికి జనసేన క్యాడర్‌లో అయోమయం చల్లారింది. మరోపక్క, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైసీపీకి ఇటీవల రాజీనామా చేయగా, ఆయన ఫిబ్రవరి నాలుగున జనసేనలో అధికారికంగా చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

గతంలో జనసేనలో కీలక నేతలుగా పని చేసిన తోట చంద్రశేఖర్, గేదెల శ్రీను తదితరులూ తిరిగి జనసేన గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో జనసేన అధినేతతో ఈ ఇద్దరూ భేటీ కాబోతున్నారట. వీరితోపాటు, జనసేనని వీడి వైసీపీలో చేరిన కొందరు నేతలు, జనసేనలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది.

‘ఎవరు వచ్చినా, వద్దని చెప్పొద్దు. కాకపోతే, టిక్కెట్లు ఇచ్చే విషయమై ఆచి తూచి వ్యవహరిద్దాం..’ అని జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్‌కి, జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారట.

జనసేన పార్టీ వైపుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా ఇంకోసారి దృష్టి సారించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఇటీవల ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అంటూ కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.