ఉభయ గోదావరి జిల్లాల్లో సైలెంట్ ఓటింగ్.?

ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలకు వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం. టీడీపీకి మరీనూ.! ఏమాత్రం తేడా కొట్టినా టీడీపీ తన ఉనికినే కోల్పోతుంది. ‘సీట్లు తగ్గుతాయేమోగానీ, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం’ అనే ధీమా వైసీపీలో పైకి కనిపిస్తున్నా, తెరవెనుక వ్యవహారాలు వేరేలా వున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్ని రాజకీయాలకు సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా చెబుతుంటారు. అందుకే, ఇక్కడే ఎక్కువగా సర్వేలు జరుగుతున్నాయి. అను నిత్యం ఏదో ఒక పార్టీ తరఫున సర్వే బృందాలు ఉభయ గోదావరిలో ‘పిచ్చెక్కినట్లు’ తిరిగేస్తున్నాయి. ఓటరు నాడి మాత్రం, ఏ సర్వే సంస్థకీ చిక్కడంలేదట.

ఇప్పటికిప్పుడు ఎన్నికలైతే లేవు. కానీ, నిత్యం సర్వేలైతే జరుగుతూనే వుంటాయి కదా.? ‘సైలెంట్ ఓటింగ్’ అనే మాట ఈ రెండు గోదావరి జిల్లాల్లో (ఉమ్మడి గోదావరి జిల్లాలు) గట్టిగా వినిపిస్తోంది. అంటే, ‘వేస్తాం లే’ అంటున్నారుగానీ, ఓటరు మనుసులో వేరే ఆలోచనలున్నయాన్నది దానర్థం. ‘చంద్రబాబుతో కష్టం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇంకా కష్టమైపోయింది’ అన్నదే మెజార్టీ భావనగా కనిపిస్తోంది. ‘అబ్బే, అదేం లేదు.

ఈసారి మొత్తం మావైపే..’ అంటోంది టీడీపీ. ‘ఛాన్సే లేదు.. ఈసారి కూడా మాదే విక్టరీ’ అంటోంది వైసీపీ. కానీ, వైసీపీ నేతలే.. కింది స్థాయిలో జరుగుతున్నది అర్థం కాక తలపట్టుక్కూర్చుంటున్నారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమయం చూసి గోడ దూకేద్దామనుకుంటున్నారట. జనసేనలోకేనా.? అంటే, ఔననీ.. కాదనీ.. అనాల్సిన పరిస్థితి. ఎందుకంటే, జనసేనాని నిఖార్సయిన రాజకీయం చేయట్లేదాయె.! కానీ, ఏదో తేడా కొడుతోంది. ఈసారి గోదావరి జిల్లాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకి అంత ఈజీ కాదు.