రోజుకో కొత్త సర్వే వెలుగులోకి వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కొన్ని అధికారిక సర్వేలు.. అంటే, మీడియా సంస్థలు నిర్వహిస్తున్నవి. కొన్ని అనధికారిక సర్వేలు.. ఇవి రాజకీయ పార్టీలు చేయించుకుంటున్నవి. వాటిని కొంచెం టాంపరింగ్ చేసి.. వదులుతుంటారు. కొన్నింటిని అస్సలు బయటపెట్టరు.
తాజాగా, వైసీపీ తరఫున ఓ సర్వే జరిగిందట.! అది కూడా వైసీపీకి చెందిన ఓ కీలక నేత, అత్యంత రహస్యంగా, అత్యంత సన్నిహితులతో చేయించిన సర్వే అట ఇది.! సర్వే ఫలితాన్ని నేరుగా పార్టీ అధినాయకత్వానికి అందించారట. కానీ, ఎలాగో ఈ సర్వే లీకయ్యిందని అంటున్నారు.
ఇంతకీ, ఆ సర్వేలో ఏముంది.? అంటే, ‘మనమే గెలుస్తాం.. కాకపోతే, బొటాబొటి మెజార్టీతో..’ అని ఆ సర్వేలో తేలిందంటూ, వైసీపీ నుంచే ఓ లీకు బయటకు వచ్చింది. ఎవరు లీక్ చేశారబ్బా.? అది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే. ఇటీవలి కాలంలో వైసీపీ చాలా సర్వేలు చేయించింది. అన్నటిలోనూ, ‘గెలుస్తాం.. కానీ..’ అన్నట్లుగానే వుంది పరిస్థితి.
‘వైనాట్ 175’ అని వైసీపీ అధినేత గట్టిగా చెబుతున్నా, కింది స్థాయిలో ప్రజా వ్యతిరేకతని చూస్తే, పరిస్థితులు కష్టంగానే వున్నాయన్నది వైసీపీ అధినాయకత్వానికీ అర్థమవుతుండొచ్చు. కానీ, తప్పదు. పార్టీ ముఖ్య నేతలు డీలా పడకూడదు. పార్టీ శ్రేణులు అసలే స్థైర్యం కోల్పోకూడదు.
టీడీపీ, జనసేన బలంగా లేకపోవడం, వైసీపీకి అడ్వాంటేజ్. పైగా, ఆ రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలూ, తరచూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం చూస్తున్నాం. జనసేన అత్యుత్సాహం, టీడీపీ వెన్నుపోటు నైజం.. వెరసి, ఆ రెండు పార్టీలూ కలిసి సమర్థవంతంగా పని చేయడం కష్టమే.
ఇదొక్కటే వైసీపీకి కాస్త అడ్వాంటేజ్. అది తప్ప, మిగతావన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులే.!