TDP : తెలుగుదేశం పార్టీకి తగ్గనున్న ఓట్లు, పెరగనున్న సీట్లు.?

TDP : సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. కానీ, అప్పుడే దేశంలో సార్వత్రిక ఎన్నికల మేనియా కనిపిస్తోంది. జమిలి ఎన్నికల ప్రచారమే ఇందుకు కారణం. సరే, జమిలి ఎన్నికలు వస్తాయా.? లేదా.? అన్నదానిపై బిన్నాభిప్రాయాలు వున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

ఎప్పటికప్పుడు దేశంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించడం గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. గతంతో పోల్చితే, ఇటీవలి కాలంలో ఇలాంటి సర్వేల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. తెలుగు నాట ప్రత్యేకంగా ఈ రాజకీయ సర్వేలు నడుస్తున్నాయి.

తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2023 చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సి వున్నప్పటికీ, కేసీయార్ గనుక గతంలోలా తొందరపడితే.. వచ్చే ఏడాది మొదట్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు. కేసీయార్ బాటలో నడిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు.

పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటి.? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

తాజా అంచనాల ప్రకారం చూస్తే, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలతో పోల్చితే, కొంత శాతం ఓటు బ్యాంకుని కోల్పోబోతోందట. కానీ, సీట్ల ప్రకారం చూసుకుంటే, 2019 ఎన్నికలతో పోల్చితే కాస్త మెరుగైన స్థానంలో టీడీపీ నిలిచే అవకాశం వుందట.

వైసీపీ – టీడీపీ నడుమ లాభపడే పార్టీగా జనసేన తనదైన సత్తా చాటబోతోందని అంటున్నారు. డబుల్ డిజిట్ ఖచ్చితంగా జనసేనకు వస్తుందనీ, రాష్ట్రంలో రాజకీయాల్ని రసవత్తరంగా జనసేన మార్చబోతోందనీ సమాచారం. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ, రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలను దెబ్బకొట్టబోతోందట.

అయితే, వైసీపీ అధికారానికి డోకా లేదని తాజా అంచనాల్ని బట్టి అర్థమవుతోంది. ట్రయాంగిల్ ఫైట్ జరగనున్న దరిమిలా.. తక్కువ ఓట్లతోనే ఎక్కువమంది గెలవడం, ఓడిపోవడం జరగొచ్చు.