Raghurama : గుడివాడ కాసినో వ్యవహారానికి సంబంధించి మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు. వైసీపీ రెబల్ ఎంపీగా వున్న రఘురామ, వీలు చిక్కితే అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తుంటారు. చిత్రమేంటంటే, వైసీపీకి చెందిన కొడాలి నాని విషయంలో మాత్రం రఘురామ ‘క్లీన్’ కామెంట్స్ చేయడం గమనార్హం.
‘అగ్రెసివ్‌గా మాట్లాడేవారు అబద్ధాలు చెప్పడం చాలా అరుదు. ఒకవేళ నా భావన తప్పు కూడా అయి వుండొచ్చు. కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లోనూ కాసినో నిర్వహించి వుండరు. ఒకవేళ నిర్వహించి వుంటే, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పేవారే..’ అంటూ రఘురామ వ్యాఖ్యానించారు.
ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడచిన రెండేళ్ళుగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఇష్టపడటంలేదనీ, అలాంటప్పుడు తానెందుకు సీఐడీ విచారణకు హాజరు కావాలని ప్రశ్నించారు రఘురామ. ‘నేనెక్కడికీ పారిపోలేదు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో నెల రోజుల సమయం అడిగాను విచారణకు హాజరయ్యేందుకు.. కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశాను..’ అని రఘురామ చెప్పుకొచ్చారు.
విజయసాయిరెడ్డిపైనా, ఇతర వైసీపీ నేతలపైనా రఘురామ షరామామూలుగానే విమర్శలు చేసేశారనుకోండి.. అది వేరే సంగతి. ఇంతకీ, కొడాలి నాని పట్ల రఘురామ ఎందుకంత ప్రత్యేకమైన ‘సానుభూతి’ చూపించినట్టు.? ఇదిప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కొడాలి నాని తిట్టే బూతులకు భయపడి రఘురామ ముందే జాగ్రత్తపడ్డారా.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.