తెలంగాణ జన సమితికి షాక్

ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. జన సమితి పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహిళా నేత, అధికార ప్రతినిధి  ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఆమె టిజెఎస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్టీలో వ్యాపారం నడుస్తోందని, పార్టీ బాగోతాన్ని బయట పెడుతానని మండి పడ్డారు.

హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో అన్ని వివరాలు బయటపెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోత్స్న వ్యాఖ్యలతో అంతటా పెద్ద చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రజలలోకి దూసుకెళ్తున్న జన సమితికి ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టు జ్యోత్స్న తిరగబడి పార్టీ బండారం బయటపెడుతానని వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఏం చెప్పబోతున్నారోనని అంతా చర్చించుకుంటున్నారు.

జ్యోత్స్న గత కొంత కాలంగా తెలంగాణ జన సమితిలో కీలకంగా పనిచేస్తున్నారు. టిజెఎస్ లోకి రాకముందు జ్యోత్స్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాచిగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేశారు. మెప్మా ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించి టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. తమ వేతనాలు పెంచి తమ సమస్యలను పరిష్కరించాలని మెప్మా ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగి సర్కార్ కు చుక్కలు చూపించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విశ్రమించేది లేదని వారు పోరు బాట పట్టారు. వారందరికి ఫుల్ సపోర్టేడ్ గా జన సమితి నుంచి జ్యోత్స్న పనిచేశారు. జ్యోత్స్న సడెన్ గా రాజీనామా చేయడంతో అంతా హాట్ టాపిక్ గా మారింది. అసలు వచ్చిన సమస్యేంటో అంతర్గతంగా చర్చించుకోకుండానే నేరుగా ప్రెస్ ముందే అంతా బయటపెడుతానని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఏం మాట్లాడబోతున్నారో, ఏం చెప్పనున్నారో అని అంతా చర్చించుకుంటున్నారు.