Sharmila : ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పార్టీ పెడతారా.? పెడితే ఏమౌతుంది.?

Sharmila : రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ముందస్తుగా అంచనా వేయలేం. ఎందుకంటే, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రాజకీయం తండ్రీ కొడుకుల్ని విడదీస్తుంది, భార్యాభర్తల్ని కూడా వేరు చేయగల శక్తి రాజకీయానికి వుంది. తమ్ముడు ఓ పార్టీలో, అన్నయ్య ఇంకో పార్టీలో.. భర్త ఓ పార్టీలో, భార్య మరొక పార్టీలో.. ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే చూశాం.

అసలు విషయానికొస్తే, వైఎస్ షర్మిల తెలంగాణలో ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ అయితే పెట్టారుగానీ, ఆమె తన పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్ళలేకపోతున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఖేల్ ఖతం అయిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో, ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అన్న వైఎస్ జగన్ నుంచి నిరాదరణ ఎదురవడంతో, తెలంగాణలో కొత్త కుంపటి.. అదేనండీ కొత్త రాజకీయ పార్టీని షర్మిల స్థాపించారన్నది ఓ వాదన మాత్రమే. ఈ వాదనని పూర్తిగా కొట్టిపారేయలేం, అలాగని పూర్తిగా సమర్థించలేం. షర్మిలకీ, వైఎస్ జగన్‌కీ ఒకే రాజకీయ వ్యూహకర్త వున్నారు. ఆయనే ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఆడమన్నట్టల్లా వైఎస్ జగన్, షర్మిల.. ఆడుతున్నారనే విమర్శ వుండనే వుంది.

సరే, ఆ సంగతి పక్కన పెడదాం, ‘ఆంద్రప్రదేశ్‌లో కూడా పార్టీ పెడతారా.?’ అని తాజాగా షర్మిలని ప్రశ్నిస్తే, ‘ఏం ఎందుకు పెట్టకూడదు.? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు కదా..’ అని ఎదురు ప్రశ్నించారు. దాంతో, షర్మిల ఏపీ రాజకీయాల వైపు చూస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరింది.
అయినాగానీ, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షర్మిల ఎదురెళ్ళే అవకాశం వుందా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.