ఒకప్పుడు ఆయన పచ్చ మీడియా జర్నలిస్టు.. ఇప్పుడాయన బులుగు మీడియా జర్నలిస్టు.! తప్పదు, మీడియా అలానే తయారైంది. టీడీపీ అనుకూల మీడియాది పచ్చ పాత్రికేయమనీ, వైసీపీ అనుకూల మీడియాది బులుగు పాత్రికేయమనీ పిలవడం కొత్తేమీ కాదు.!
రాజకీయ పార్టీలకు రంగులుంటాయిగానీ, మీడియాకి రాజకీయ పార్టీల రంగులేంటి.? అంటే, రాజకీయ పార్టీలు మీడియాని అడ్డగోలుగా వాడేస్తుంటే, ఆ రంగులు మీడియాకి అంటుకోకుండా వుంటాయా.?
అసలు విషయానికొస్తే, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అవబోతున్నారట. ఆయన సీనియారిటీకి ఆ పదవి దక్కడం సబబే. కానీ, ఇది వైసీపీ ప్రభుత్వంలో, వైసీపీ ఆయనకు ఇస్తోన్న బహుమతి కావడమే విమర్శలకు తావిస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ప్రస్తుతం వైసీపీ సొంత మీడియా సాక్షిలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా ఆ పదవిలో శ్రీనాధ్ రెడ్డి వున్నారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 7న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రెస్ అకాడమీ కొత్త ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావుని నియమిస్తూ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందట.
ఒకప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణలు పారదర్శకంగా వుండేవి. ఏ పార్టీకీ ఆయన కొమ్ముకాసేవారు కాదు. కానీ, ఆయనా కాలంతో పాటు మారారు. ప్రస్తుతం ఆయన మీద బులుగు జర్నలిస్టు అనే ముద్ర పడింది. ఆ ముద్ర వేసింది కూడా టీడీపీనే.! కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అవుతున్నందుకు పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.