జీతాలు ఇవ్వకపోతే సచివాలయ ఉద్యోగులు ఒప్పుకుంటారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డ్ సచివాలయాలను ఏర్పాటు చేసి 1,26,728 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత ఉద్యోగులకు వేతనాలను పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఆలస్యంగా ప్రోబేషన్ డిక్లేర్ చేయడంతో జీతాల పెంపు కూడా వాయిదా పడింది. అయితే ఆగష్టు నెల నుంచి కొత్త వేతనాలు అందుకుంటామని సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు.

అయితే ఆగష్టు నెలలో కూడా కొత్త వేతనాలు అందడం కష్టమని వైరల్ అవుతున్న వార్తలు ఉద్యోగులకు టెన్షన్ పెడుతున్నాయి. 1,26,728 మంది ఉద్యోగులలో ప్రొబేషన్ ఖరారైన ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అయిన సచివాలయ ఉద్యోగులకు వేతనాలను పెంచినా హెడ్ అకౌంట్ లో కేటాయింపులు జరగలేదని సమాచారం. ట్రెజరీ వర్గాల నుంచి ఈ మేరకు సమాచారం అందుతోంది.

ఆగష్టులో కూడా ప్రభుత్వం పాత జీతం ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని ఆగష్టు నెలలో చెల్లించాల్సిన మొత్తాన్ని సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం చెల్లించనుందని బోగట్టా. ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం ఆగ్రహం తెప్పిస్తోంది. గత కొన్నేళ్లలో ఖర్చులు పెరిగిన స్థాయిలో వేతనాలు పెరగలేదని ఏపీ సర్కార్ వేతనాల పెంపును మరింత ఆలస్యం చేయడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులలో వైసీపీని అభిమానించే ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. వైసీపీ అలాంటి అభిమానులను దూరం చేసుకోవడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం అయితే ఉండదని చెప్పవచ్చు. వైసీపీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.