స్కిప్టు లోపం.! వైఎస్ జగన్ సెల్ఫ్ ట్రోలింగ్.!

కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగుకి గురవుతున్నాయి. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యల్ని వైఎస్ జగన్ చేయకపోతేనే మంచిది. ఎన్నికల సీజన్ వచ్చేసింది.

ఈ తరుణంలో, ప్రజలకు తాము ఏం చేశామన్నది బలంగా చెప్పుకోవాల్సి వుంటుంది ఏ ముఖ్యమంత్రి అయినా. చెప్పుకోవడానికి చాలా సంక్షేమ పథకాలున్నాయ్. వాటి గురించి చెప్పుకుంటూ పోతే, ఎంత సమయమైనా సరిపోదు. లెక్కలతో సహా ప్రజల ముందుంచితే, ప్రజల్లో వైసీపీ పట్ల ఇంకాస్త సానుకూలత పెరుగుతుంది.

అది మానేసి, విపక్షాలపై రాజకీయ విమర్శలకు వైఎస్ జగన్ ఎక్కువ అవకాశమిస్తున్నారు. అందునా, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారం, టీడీపీ – జనసేన పొత్తు.. ఇలాంటి విషయాలపై వైఎస్ జగన్ ఫోకస్ తగ్గించడమే మంచిదిగానీ, తగ్గించడంలేదు.

కుటుంబంలో చిచ్చు పేరుతో వైఎస్ జగన్ ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల, కాంగ్రెస్‌లో చేరడంపైనే వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేసి వుండొచ్చు. కానీ, అది జనాల్లోకి ఇంకోలా సంకేతాలు పంపింది.

షర్మిలకి కూడా వైఎస్ జగన్ భయపడుతున్నారా.? షర్మిల వెనుక చంద్రబాబు వున్నారనే అర్థం వచ్చేలా జగన్ ఎందుకు మాట్లాడినట్లు.? అని జనాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధాలు అంటగట్టడం దగ్గర్నుంచి, వివేకా కుమార్తె సునీతా రెడ్డిపైనా వైసీపీ చేసిన తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యల్ని జనం చూశారు.

ఇక, షర్మిలపైనా వైసీపీ నేతలు తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. షర్మిల వెంట విజయమ్మ నడిస్తే, విజయమ్మనీ తూలనాడుతారు వైసీపీ నేతలు. కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నదే వైసీపీ.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అందుకే, ఇలాంటి విషయాల జోలికి వెళితే, సెల్ఫ్ ట్రోలింగ్ అవుతుందని వైఎస్ జగన్ గుర్తెరగాలి.!