Savitha: ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు వైకాపా నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తున్నారు. అయితే తాజాగా ఓ మహిళ మంత్రి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పెనుగొండ ఎమ్మెల్యే మంత్రి సవిత అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ మహిళల గురించి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎన్నో పథకాల ద్వారా డబ్బులను నేరుగా వారి ఖాతాలలో జమ చేశారు. 45 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ కూడా 18000 చొప్పున విడుదల చేశారు. ఇలా ఈ డబ్బుతో మహిళలు తప్పు దావపట్టారు అంటూ సవిత తెలిపారు.
ఇక అమ్మ ఒడి కార్యక్రమం కింద పదిహేను వేల రూపాయలు ప్రతి తల్లి ఖాతాలో వేయడంతో ఆ డబ్బుతో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని మద్యానికి అలవాటు పడ్డారంటూ ఈమె మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారింది. ఇలా మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలియజేశారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు మండలి చైర్మన్ తెలిపారు.
ఇలా మహిళల గురించి ఓ మహిళా మంత్రి అయ్యి ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అలాగే వైకాపా నేతలు ఈమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇక ఈమె వ్యాఖ్యలపై మండలిలోని వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మంత్రి సవిత బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.