ఆంధ్రప్రదేశ్ లో త్వరలో నిర్వహించబోయే పంచాయతీ ఎన్నికలు మినీ యుద్దాన్ని తలపిస్తున్నాయి. సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ నేత పుష్పవతి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి సోమవారం అనునామాస్ప రీతితో ఉరివేసుకొని మరణించాడు.
శ్రీనివాస్ రెడ్డి మృతిపై ఆయన భార్య పుష్పవతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రత్యర్థి పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఆయన్ను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ రెడ్డి కాళ్లు చేతులు కట్టేసి అటవీ ప్రాంతంలో వదిలేసి చెబుతున్నారు. ఐతే కిడ్నాప్‌కు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గానీ, పుష్పవతి గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో వారి ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు.
సోమవారం మధ్యాహ్నం వరకు శ్రీనివాస్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతడు పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి పీఎస్‌లోనే ఉన్నాడని భావించామని.. కానీ అంతోలనే శవమై తేలాడని కుటుంబ సభ్యులు చెప్పారు. జగ్గంపేట మండలం కాండ్రేగల గ్రామ శివారులోని పొలంలో శ్రీనివాస్ రెడ్డి ఉరివేసుకున్నాడు. ఆయన మృతిపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, తొలి దశ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు 19, 491, వార్డు సభ్యుల స్థానాలకు 79, 799 నామినేషన్లు దాఖలయ్యాయి.