TDP – YCP: ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే టీడీపీ, వైసీపీ పార్టీల నేతలు ఒక్క చోట కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి రాజకీయ పరిణామం ఖమ్మం జిల్లా సారపాక ఐటీసీ కంపెనీలో చోటుచేసుకుంది. అక్కడ జరుగుతున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీడీపీ అనుబంధ సంఘం టీఎన్డీయూసీ, వైసీపీ మద్దతుతో బరిలో నిలిచింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీని ఓడించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు అనూహ్యంగా కలిసి రావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సారపాక ఐటీసీ కంపెనీలో అత్యధిక కార్మికులు ఆంధ్రా మూలాలున్న వారే. దీంతో అక్కడ వైసీపీ, టీడీపీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లోనూ టీడీపీ కార్మిక సంఘం, వైసీపీ మద్దతుతో గెలుపొందింది. ఈసారి కూడా అదే మళ్లించేందుకు టీడీపీ, వైసీపీ కలిసి వ్యూహాలు రచిస్తున్నాయి. కంపెనీలో 5 వేల మంది కార్మికులుండగా, ఓటింగ్ హక్కు కలిగిన వారు 1,253 మంది మాత్రమే. వీరి ఓట్లను తమవైపుకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో మరొక ఆసక్తికరమైన పరిణామం జనసేనకు సంబంధించినది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన నేతలు, ఖమ్మంలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో జనసేన మద్దతుదారుల ఓట్లు చీలిపోయాయి. ఒక వర్గం టీడీపీ-వైసీపీ కూటమిని సమర్థిస్తుండగా, మరొక వర్గం కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. ఈ గందరగోళ పరిస్థితులు టీఎన్డీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య హోరాహోరీ పోరుకు దారి తీసే అవకాశముంది.
ఈ ఆసక్తికర ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ జరుగనుండగా, అదే రోజు రాత్రికి ఫలితాలు ప్రకటించనున్నారు. సారపాక ఐటీసీ ఎన్నికలు కేవలం కార్మిక సంఘం నాయకత్వాన్ని మాత్రమే నిర్ణయించవు, ఖమ్మం జిల్లాలోని రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.