ప్రతిపక్షాలకు షాకిచ్చిన టిఆర్ఎస్… టిఆర్ఎస్ లో చేరనున్న మరో ఎమ్మెల్యే

నియోజకవర్గ ప్రజల అవసరాలు, అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్టు టిడిపి నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. శనివారం ఆయన ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. తాను పార్టీ మారుతున్న విషయం వాస్తవమేనని సండ్ర తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఏమన్నారంటే…

ప్రజల అవసరాల కోసం సీఎం కేసీఆర్ తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాను. మరి కొద్ది రోజుల్లోనే టిఆర్ఎస్ లో చేరుతాను. కేసులకు భయపడే వాడినైతే అప్పుడే పార్టీ మారేవాడిని. అయినా ఇప్పుడు అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం చేతుల్లో ఏం లేదు. మూడు సార్లు నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మారుతున్నాను. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ది చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడు చేరేది కార్యకర్తలతో చర్చించిన తర్వాత ప్రకటిస్తాను.  అని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. 

సండ్ర వెంకట వీరయ్య టిడిపి ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. శాసన సభ్యుల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఎంఐఎం తో కలిసి టిఆర్ఎస్ పోటి చేస్తుంది. అయితే కాంగ్రెస్ కు కూడా ఎమ్మెల్సీ సీటు గెలుచుకునేంత సభ్యుల మెజార్టీ ఉందన్న నమ్మకంతో కాంగ్రెస్ కూడా ఎమ్మెల్సీ రంగంలోకి దిగింది. గూడురు నారాయణ రెడ్డిని తమ సభ్యుడిగా ప్రకటించింది.

కానీ అనూహ్యంగా టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించడంతో ఒక్కసారిగా రాజకీయాలు తారుమారయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రేగ కాంతారావు, ఆత్రం సక్కులు కారెక్కేందుకు సిద్దమయ్యారు. టిడిపి నేత సండ్ర కూడా బహిరంగ ప్రకటన చేశారు. మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా పార్టీ మార్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.