పీవీ సింధు కులంపై అంతర్జాలంలో వెతుకులాట.!

పీవీ సింధు ఏ కులానికి చెందిన వ్యక్తి.? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. వరుసగా రెండోసారి ఒలింపిక్ పోటీల్లో మెడల్ సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు రికార్డులకెక్కిన విషయం విదితమే. కానీ, ఆమె సాధించిన ఘనత కంటే కూడా, ఆమె కులం ఏంటి.? అన్నదాని మీద చాలా ఎక్కువమందికి ఆసక్తి వుందట. అంతర్జాలంలో గత కొద్ది రోజులుగా పీవీ సింధు కులం గురించి వెతుకులాట చాలా ఎక్కువగా జరుగుతోందని ఆయా సెర్చ్ ఇంజెన్ల సెర్చ్ రిజల్ట్స్ ద్వారా వెల్లడవుతోంది. మరోపక్క, పీవీ సింధు అభిమానుల మంటూ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా రాజకీయాలు కూడా చేసేస్తున్నారు.

అంతేనా, అసలామె తెలంగాణకు చెందిన వ్యక్తా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తా.? అన్న ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి. పీవీ సింధు ధరించింది.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక జెండాలు కావు.. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక జెండాలు, ఎజెండాలు ఏమీ లేవు. అందరిదీ ఒకటే జెండా.. అదే మువ్వన్నెల జెండా. భారతదేశం తరఫున పీవీ సింధు, ఒలింపిక్ పోటీల్లో పాల్గొంది, సత్తా చాటింది. 130 కోట్ల మందికి పైగా భారతీయులు, పీవీ సింధు విజయాన్ని చూసి మురిసిపోతున్నారు. మధ్యలో ఈ కులం లొల్లి ఏంటి.? రాష్ట్రం లొల్లి ఏంటి.? మన తెలుగమ్మాయ్ గనుక.. రెండు తెలుగు రాష్ట్రాలూ ఇంకాస్త ఎక్కువగా సింధు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడాన్ని తప్పుపట్టలేం.. అంతకు మించి సెలబ్రేట్ చేసుకోవాలి కూడా. కానీ, కులం పేరుతో వెతుకులాట.. అత్యంత దురదృష్టకరం.