ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మా నినాదం: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

‘మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వస్తుందంటే ముందుగా స్వాగతించే పార్టీ వైఎస్సార్సీపీయే’నంటూ వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి ఎనిమిదిన్నరేళ్ళు పూర్తయ్యింది. మళ్ళీ ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని చూడగలమా.? ఛాన్సే లేదు. తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఆ తెలంగాణ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసే ప్రసక్తే వుండకపోవచ్చు.

కానీ, విభజన జరిగిన తీరు గురించి తరచూ చర్చ జరుగుతూ వుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీనే పలు సార్లు విభజన తీరుని తప్పు పట్టారు. ఇంకోపక్క విభజన చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టులో పలు కేసులు విచారణ దశలో వున్నాయి. ఏళ్ళు గడుస్తున్నా వాటికి మోక్షం కలగడంలేదు. తెలంగాణలో వైసీపీని కాదనుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కేవలం తాము ఏపీకి మాత్రమే పరిమితమయ్యామనీ, తెలంగాణ రాజకీయాల గురించి ఆలోచన చేయడంలేదనీ, తెలంగాణలో పార్టీని వదులుకున్నామని ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చెప్పారు.

అయితే, తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజయోజనాల కోసం ఏపీతో కొట్లాటకీ సిద్ధమని షర్మిల చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ కలిసిపోవాలని కోరుకోవడమేంటి.? ఒక్కటి మాత్రం నిజం.. మళ్ళీ ఆనాటి విభజన గాయాల్ని ఇంకోసారి తిరగతోడుకునే పరిస్థితి వస్తే.. అది మరింత భయంకరంగా వుండబోతోంది.