ప్రొద్దుటూరు టిక్కెట్టు కావాలంటే రూ 30 కోట్లు..ఓపెన్ ఆఫర్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లకు తెలుగుదేశంపార్టీలో బేరాలు మొదలైనట్లే కనిపిస్తోంది. మామూలుగా అయితే టిక్కెట్ల కోసం డబ్బులు ఇచ్చిపుచ్చుకోవాటాలు చాలా సహజం. కానీ ఓపెన్ గా వేలంపాటలు వేసినట్లుగా బేరాలు  జరగటం మాత్రం ఇదే మొదలు. ఇంతకీ విషయం  ఏమిటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరులో పోటీ చేయదలచుకున్న నేతలెవరైనా రూ 30 కోట్లు తెస్తే తాను టిక్కెట్టిప్పిస్తానంటూ మాజీ ఎంఎల్ఏ వరదరాజులురెడ్డి బేరం పెట్టటం జిల్లాలో సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని బిసి సంఘాల నేతలతో కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మాజీ ఎంఎల్ఏ వరదరాజులురెడ్డి కూడా హజరయ్యారు.

 

సమావేశంలో బిసి నేతలు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఓట్లలో సగానికి పైగా బిసిలే ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 2.20 లక్షల ఓట్లుంటే అందులో లక్ష ఓట్లకు పైగా బిసిలవే అంటూ లెక్కలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిసి కులాల్లో ఎవరికి టిక్కెట్టు వచ్చినా తామంతా ఐకమత్యంగా పనిచేసి అభ్యర్ధిని గెలిపిస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. తర్వాత వరదరాజులురెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సాహం చూస్తుంటే బాగా ముచ్చటేస్తోందన్నారు. అయితే టిక్కెట్టిస్తే పోటీ చేయటం కాదని అందుకు డబ్బులు కూడా ఖర్చు చేయాల్సుంటుందన్నారు.

 

ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్న నేతలు రూ 30 కోట్లు ఖర్చు చేయటానికి కూడా ఉత్సాహం చూపితేనే బాగుంటుందన్నారు. కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టటానికి సిద్దపడకపోతే ఎన్నికల్లో పోటీ చేయటం వృధా అంటూ కుండబద్దలు కొట్టారు. ఎప్పుడైతే మాజీ ఎంఎల్ఏ రూ 30 కోట్ల ప్రస్తావన తెచ్చారో బిసి నేతల మొహాలు మాడిపోయాయి. రూ 30 కోట్లు ఖర్చు చేయటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే చెప్పండి టిక్కెట్టిప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పటమే విచిత్రంగా ఉంది. మాజీ ఎంఎల్ఏ చెప్పిన రూ 30 కోట్ల మాట వినగానే బిసి నేతలెవరూ మళ్ళీ చప్పుడు చేయలేదు. అంటే వరదరాజులురెడ్డి చెప్పిన దాని ప్రకారం ప్రతీ నియోజకవర్గంలో సగటును ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకోవచ్చు.