చంద్రబాబు బాటలో ముఖ్యమంత్రి కేసీయార్ నిరసన.!

గుర్తుందా.? 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, దర్మ పోరాట దీక్షలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన చాలా వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు చేపట్టిన ‘పబ్లిసిటీ’ నిరసన అది.

అచ్చం అదే బాటలో, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పుడు ‘వరి పోరాటం’ చేస్తున్నారు కేంద్రం పైన. తెలంగాణలో స్వయంగా కేసీయార్ నిరసనల్లో పాల్గొనడమనేది చాలా అరుదైన విషయం. ముఖ్యమంత్రి హోదాలో కేసీయార్ తాజాగా చేపట్టిన నిరసన సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.

ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేయాలని తెలంగాణలోని కేసీయార్ సర్కార్ గతంలో నినదించిందో, అదే ధర్నాచౌక కేంద్రంగా కేసీయార్, నిరసన కార్యక్రమాల్ని చేపట్టడాన్ని ఏమనుకోవాలి.? ‘విధి రాత’ అనుకోవాలేమో.! తెలంగాణ వచ్చాక ధర్నాలు చేయాల్సిన అవసరమేముందని గతంలో విపక్షాల్ని వెక్కిరించిన కేసీయార్, ఇప్పుడు తానే నిరసనల కోసం రంగంలోకి దిగడం విశేషమే మరి.

కేంద్రం, తెలంగాణ రాష్ట్రం పండించిన వడ్లు కొనడంలేదనీ, ఈ కారణంగా వరి పంట వేసే విషయమై ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని తెలంగాణ సమాజానికి సూచిస్తోంది కేసీయార్ ప్రభుత్వం. అయితే, కేంద్రం చెప్పింది వేరు.. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది వేరంటూ బీజేపీ గుస్సా అవుతోంది.

ఈ సందట్లో రాష్ట్రం తగ్గించాల్సిన పెట్రో ధరల వ్యవహారం అటకెక్కింది. కేసీయార్ ప్రభుత్వ వైఫల్యాలూ అటకెక్కాయ్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం గురించిన చర్చ కూడా సైడ్ లైన్ అయిపోయింది.