వాళ్ళకు వైసీపీ బలం.. వైసీపీకి వాళ్ళు ఎంతవరకు బలం.?

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చాలామంది నాయకుల్లో.. సొంత బలం ఎంతమందికి వుంది.? అన్నది బహిరంగ రహస్యమే. దాదాపుగా అందరూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో బలంతో గెలిచినవారే. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెప్పుకుంటారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా, తన సొంత బలానికి వైఎస్ జగన్ బలం తోడై తాను గెలిచానని చెప్పుకున్నారు పలు సందర్భాల్లో. ఇక, వైసీపీకి వైసీపీ నేతల వల్ల ఉపయోగమేంటి.? అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో ఎందుకు షురూ అయ్యింది.? ఇటీవలి కాలంలో వరుసగా ప్రభుత్వం వివాదాల్లోకెక్కుతోంది. ప్రభుత్వంలో వున్నవారికి విపక్షాల నుంచి విమర్శలు తప్పవు. కొన్నిసార్లు న్యాయస్థానాల్లో మొట్టికాయలూ తప్పవు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రభుత్వం వాదనను అధికార పార్టీ నేతలు బలంగా వినిపించగలగాలి. విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టగలగాలి. కానీ, వైసీపీ ముఖ్య నేతలెవరూ ఆ పని చేయలేకపోతున్నారు.

అమరావతి విషయంలో కావొచ్చు, వినాయక చవితి వేడుకల విషయంలో కావొచ్చు.. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాల విషయంలో ఇదే పరిస్థితి. వినాయక చవితి వేడుకల విషయంలో కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ కావొచ్చు, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కావొచ్చు.. వాటిని సవివరంగా ప్రజలకు తెలియజెప్పలేకపోతున్నారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి, ప్రతి విషయాన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేరు కదా.? మంత్రులు బాధ్యత తీసుకోవాలి. సలహాదారులు ముందు వరుసలో నిలబడాలి. వైసీపీకి చెందిన ఇతర నేతలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, అలా జరగడంలేదు. దాంతో, ప్రతి విషయంలోనూ ప్రభుత్వానిదే తప్పు.. అన్నట్టు తయారవుతోంది వ్యవహారం. ఇదే నిర్లక్ష్యం.. ఇదే అసమర్థత వైసీపీ నేతలు కొనసాగిస్తే.. 2024 ఎన్నికల నాటికి వైసీపీ బలహీనమైపోతుంది. అప్పుడు మళ్ళీ కేవలం వైఎస్ జగన్ జెండా మీదనే గెలవాలనుకుంటే.. చాలామంది వికెట్లు పడిపోవడం ఖాయం.