బాలయ్యను టార్గెట్ చేయబోతున్న లోకేశ్.. అల్లుడి కోసం త్యాగం తప్పదా?

2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్ కు భారీ షాక్ తగిలిందనే సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో నారా లోకేశ్ కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆ ఖర్చుకు తగిన ఫలితం అయితే దక్కలేదు. 2024 ఎన్నికల్లో కుడా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

అయితే గత కొన్ని నెలలలో మంగళగిరిలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. టీడీపీ కీలక నేతలు మంగళగిరిలో ఆ పార్టీని వీడుతున్నారు. లోకేశ్ ఎంతలా కష్టపడుతున్నా మంగళగిరిలో టీడీపీకి అనుకూల ఫలితాలు రావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మంగళగిరి కాకుండా లోకేశ్ పోటీ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏదనే ప్రశ్నకు హిందూపురం పేరు సమాధానంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురంకు ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూపురం నుంచి పోటీ చేయాలని లోకేశ్ నిర్ణయం తీసుకుంటే మాత్రం బాలయ్య తన సీటును త్యాగం చేయక తప్పదు. చాలా సంవత్సరాల నుంచి హిందూపురంలో తెలుగుదేశంకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేసినా గెలవడం గ్యారంటీ అని చాలామంది భావిస్తారు.

లోకేశ్ హిందూపురం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తే బాలయ్య మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో లేక పోటీకే దూరంగా ఉంటారో చూడాల్సి ఉంది. అయితే హిందూపురం నుంచి లోకేశ్ పోటీ చేస్తే మాత్రం వైసీపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల్లో అంతిమంగా గెలుపే లక్ష్యం కాబట్టి లోకేశ్ పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.