జగన్ హత్యాయత్నం కేసుపై రోజా సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో శనివారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ కి అప్పగించడానికి రాష్ట్ర పోలీసులు నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే ఎన్ఐఏ కి అప్పగించబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంపై స్పందించిన రోజా చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా. ఆమె ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే కింద ఉంది చదవండి.

చంద్రబాబు హిట్లర్ లా నియంతలా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కూడా గౌరవించాం అంటున్నారంటే ఆయన్ని ఏమనాలి? కేంద్రం పరిధిలో ఉన్న ఎయిర్పోర్టులో జగన్ ను చంపేస్తే నేరం కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు ప్లాన్ చేశారు. 100 శాతం హత్యాయత్నం మీరే చేేయించారన్నట్లుగా మీ మాటలు చెబుతున్నాయి అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఐఏ కి ఇవ్వడానికి నిందితుడు శ్రీనివాస్ కు లేని బాధ చంద్రబాబుకు, లోకేష్ కు ఎందుకు? అంటూ ప్రశ్నించారు.

మీకు సమస్య లేనపుడు ఆ కేసును ఎన్ఐఏ కి అప్పగించాలి. ఎన్ఐఏ కి కేసు అప్పగించాలని ఆ అధికారులు కోరితే రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదు. కిడారి సర్వేశ్వరరావు కేసును బదిలీ చేసినట్టే జగన్ కేసు ఎందుకు ఎన్ఐఏ కి ఇవ్వడం లేదు? శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోనివి అంటున్నారు. మరి నీ చుట్టూ ఉన్న జడ్ కేటగిరి భద్రత కేంద్రం కల్పించిందే కదా. వారిని నీ చుట్టూ ఎందుకు ఉంచుకుంటున్నావు ? వారిని పంపించేయి అంటూ మండిపడ్డారు రోజా.

3,500 కిలోమీటర్లకు పైగా ప్రజల్ని నేరుగా కలసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు జగన్. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు వెళ్లారు. తిరిగి అధికారంలోకి రాను అని భావించిన చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లో భౌతికంగా జగన్ ను లేకుండా చేయడానికి ప్లాన్ చేసినా… భగవంతుడి దయ వల్ల జగన్ బయటపడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరితో రెస్టారెంట్ మీరే ప్రారంభించారు. దాడికి ఉపయోగించిన కత్తిని ఎప్పటి నుండో అక్కడే దాచి ఉంచారు. నిందితుడు శ్రీనివాస్ కధలు రాస్తున్నదంటూ మీ చానెల్స్ లో ప్రచారం చేయించారు. ఆపరేషన్ గరుడ అని సినిమాలు లేని శివాజి అనే నటుడి చేత చెప్పించారు. ఈ కేసులో ఇప్పటివరకు శివాజీని ఎందుకు విచారించలేదు? హత్యాయత్నం వెనుక ఉన్న హర్షవర్ధన్ చౌదరిని, శివాజీ చౌదరిని బయటకు లాగాలి. కేసును ఎన్ఐఏ కి అప్పగించాలని రోజా డిమాండ్ చేశారు.