ప్రముఖ ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ, ‘వ్యూహం’ సినిమాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తీస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ బయటకు వచ్చింది. రామ్ గోపాల్ వర్మ మార్క్ ఇంటెన్సిటీ టీజర్‌లో వుందా.? అంటే, ఒకప్పటి ఆయన స్పార్క్ అయితే లేదన్నది నిర్వివాదాంశం.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి, సీబీఐ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ బంపర్ విక్టరీ సాధించడం.. ఇవన్నీ ‘వ్యూహం’ సినిమాలోని ప్రధాన అంశాలు.
టీజర్‌లో ఆయా ఘట్టాల్ని ఆర్జీవీ, తన ట్రేడ్ మార్క్‌తో దించేశాడు. భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించింది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో ముందర వైఎస్ జగన్, భారతి పాత్రలు చేతిలో చేతులు కలిపి.. ఓ నవ్వు నవ్వడం.. ఎన్నికల్లో విజయానికి గుర్తు.. అనుకోవచ్చు.
అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ టీజర్‌కి వక్రభాష్యాలు చెబుతోంది. ఆర్జీవీ ‘వ్యూహం’కి ప్రతివ్యూమం అమలు చేస్తోంది టీడీపీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై వైఎస్ జగన్, భారతి ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ సీన్‌ని ఎడిట్ చేసి మీమ్స్ వదులుతున్నారు.
ఈ మీమ్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే, వైఎస్ జగన్ గెలుపు సంబరాలు.. వంటి వాటికి వైసీపీ కార్యకర్తలు బాగా కనెక్ట్ అవుతున్నారు.
మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ అరెస్టు సందర్భంగా జనం గుమికూడిన సన్నివేశాల్ని ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ మీమ్స్.. వాటికి వైసీపీ మద్దతుదారుల స్పందన.. వెరసి, ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకి ఏదైతే హైప్ కావాలనుకుంటున్నాడో.. అది వచ్చేస్తున్నట్టే.! కానీ, ఈ సినిమా వల్ల వైసీపీకి ఎంత ఉపయోగం.?