హాట్ టాపిక్: కోటంరెడ్డి అరెస్టు తప్పదా?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్స్ కి దిగుతున్నట్లే ఉంది. కొన్నిరోజుల క్రితం జగన్ సర్కార్ పై ఆరోపణలు చేసి, రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేస్తానని ప్రకటించుకున్నారు కోటంరెడ్డి. అయితే.. నాలుగు నెలల క్రితం జరిగిన ఒక సంఘటనకు సంబందించిన ఒక కేసు వ్యవహారం కోటంరెడ్డి అరెస్టుకు కారణమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది!

గత ఏడాది అక్టోబరు లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో ఆయన అనుచరులు టీడీపీకి చెందిన ముస్లిం నేత అల్లాభక్షుపై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. ఆ సమయంలో ఈ ముస్లింనేతకు తోడుగా ఉన్న మాతంగి కృష్ణ అనే దళిత నేతను తర్వాత రోజు కారులో ఎక్కించుకుని విచక్షణా రహితంగా దాడిచేశారు. అయితే ఈ ఘటనలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని తేలడం.. అనంతరం హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు అవడం జరిగింది.

అనంతరం ఎస్సీఎస్టీ కమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది! దీంతో కోటంరెడ్డి మీడియా ముందుకు వచ్చారు… “దమ్ముంటే నన్ను అరెస్టు చేయండీ” అంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు.

“మీ బెదిరింపులకు, వేధింపులకు నా వెనుక నడిచే నేతలు, కార్యకర్తలే కాదు… నావద్ద పనిచేసే డ్రైవర్లు కూడా భయపడరు. నన్ను కూడా ఈ కేసు లో చేర్చారు. దమ్ముంటే నన్ను అరెస్టు చేసి వాహనాల్లో తిప్పుతూ తుపాకులతో బెదిరించుకోండి” అంటూ సవాల్‌ విసురుతున్నారు!

ఈ వ్యవహారం మొత్తాన్ని గ్రహించినవారు మాత్రం… వీలైనంత దొందర్లో కోటంరెడ్డి అరెస్టు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు!