వైసీపీకి సీమలో సగం కష్టమేనట.!

2024 ఎన్నికల్లో వైసీపీ ఇంకోసారి గెలిచి, అధికార పీఠమెక్కుతుందా.? ఇంకో ఐదేళ్ళు అధికార పీఠమెక్కే ఛాన్స్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుందా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో విపక్షాలేవీ అంత బలంగా లేవు. అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఏ విపక్షానికీ లేదు. కాకపోతే, ఖచ్చితంగా వైసీపీ వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోతుందని పలు సర్వేలు చెబుతున్నాయి.

ఎంపీ సీట్ల పరంగా చూసుకుంటే, వైసీపీకి పదిహేను సీట్లు రావొచ్చనీ, మిగతా పది సీట్లను టీడీపీ, బీజేపీ, జనసేన పంచుకోవచ్చనీ పలు సర్వేలు ఇప్పటికే అంచనా వేసిన సంగతి తెలిసిందే.

ఆ లెక్కన, వైసీపీ 100 సీట్లకు అటూ ఇటూగా మాత్రమే వచ్చే ఎన్నికల్లో దక్కించుకోవచ్చు. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. స్వల్ప ఓట్ల శాతంతో ఫలితాలు తారుమారైపోతాయ్. అందుకే, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు’ అంటూ పదే పదే జనసేనాని చెబుతున్నారు.

తాజాగా వెలుగు చూస్తోన్న ఓ అంచనా ప్రకారం రాయలసీమలోనే వైసీపీ పట్ల వ్యతిరేకత అనూహ్యంగా పెరిగిందట. గతంలో గెలిచిన సీట్లతో పోల్చితే, సగం సీట్లను వైసీపీ కోల్పోనుందట. దానిక్కారణం కూడా, స్థానిక నాయకత్వమేనన్న ప్రచారం జరుగుతోంది.

‘వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత తక్కువగానే వుంది.. కానీ, వైసీపీ ప్రజా ప్రతినిథులే పార్టీకి శాపంగా మారుతున్నారు’ అని సాక్షాత్తూ వైసీపీ మద్దతుదారులే అభిప్రాయపడుతున్న పరిస్థితి.