మార్గదర్శి అక్రమ డిపాజిట్స్ కేసులో రామోజీ రావు మళ్ళీ కోర్టు బోను ఎక్కనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి అక్రమ డిపాజిట్స్ యొక్క వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు వైఎస్ హయాంలో సంచలనం సృష్టించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణం రాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్.యు.ఎఫ్) ద్వారా డిపాజిట్ల సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టు ముందు రామోజీ రావు వాదనలు వినిపించగా, ఈ వాదనలతో అంగీకరించిన ఉమ్మడి హై కోర్టు ఈ కేసును కొట్టివేసింది.గోప్యంగా ఉంచిన ఉమ్మడి హైకోర్టు తీర్పుపై తాజగా మళ్ళీ సుప్రీంను ఉండవల్లి ఆశ్రయించారు. 266 రోజుల పాటు జరిగిన జాప్యాన్ని మన్నించాలనిసుప్రీం కోర్టును కోరారు.
గత జనవరిలో జరిగిన విచారణ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కేసులో పార్టీ గా చేర్చారు. హైదరాబాదు లోని మొదటి అదనపు నగర మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేసిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఐ.జి (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు) కృష్ణంరాజును కూడా ఈ కేసులో పార్టీ గా చేరుస్తూ ఈ రోజు సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదు చేసిన అప్పటి ఐజి కృష్ణంరాజు వాదనలు గాని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వాదనలు గాని వినకుండానే ఈ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఉండవల్లి సుప్రీం కోర్టు ముందు వాదనలు వినిపించారు.
అదే గాకుండా రిజర్వ్ బ్యాంకు ను కూడా పార్టీ గా చేర్చమని పిటీషనర్ ఉండవల్లి దాఖలు చేసికున్న దరఖాస్తుకు కూడా సుప్రీం ఆమోదం తెలిపింది. రామోజి రావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ కు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు, కృష్ణంరాజుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపడుతామని సుప్రీం తెలిపింది. అయింపోయిందనుకున్న కేసు మళ్ళీ రామోజీ రావు మెడకు చుట్టుకుంది. గతంలో ఈ కేసులో నిర్దోషిగా బయటపడ్డ రామోజీ రావు ఈసారి కోర్టులో ఎలాంటి వాదనలు చేయనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నోటీసులకు రామోజీ రావు ఇచ్చే లిఖిత పూర్వక సమాధానం అధికారులకు స్పష్టతను ఇవ్వకపోతే రామోజీ మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.