Pawan Kalyan: ప్రపంచంలో తానొక్కడినే తెలివైన వాడిని.. మిగిలవాళ్లంతా ఎర్రి గొర్రెలు, జ్ఞాపశక్తి లేనివాళ్లు.. తాను ఏమి చెప్పినా తలాడించి, ఈలలు వేస్తూ, గోల చేస్తారు.. నా నాలుకకు నరం లేదు.. ఏదిబడితే అది మాట్లాడతాను.. ఒక్కో వేదికపైనా ఒక్కో మాట మాట్లాడతాను.. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా పవన్ కల్యాణ్ ప్రసంగాలు, అందులోని విమర్శలు ఉంటుంటాయని చాలా మంది అంటారు!
ఈ క్రమంలో ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన కార్యక్రంలో ప్రసంగించిన పవన్ కల్యాణ్… రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున గట్టిగా మాట్లాడలేదని.. మాట్లాడితే కొడతారని, వ్యాపారాలు పోతాయనే భయమని.. అంత దరిద్రపుగొట్టు బతుకులెందుకు..? ధైర్యం లేని నాయకులెందుకు..? అంటూ విరుచుకుపడ్డారు! దీంతో.. పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ ఈ స్థాయిలో తిట్టింది.. చిరంజీవి, చంద్రబాబు గురించేనా..?
రాష్ట్ర విభజనకు అనుకూలంగా అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లేఖ రాసింది చంద్రబాబే అనే విషయం పవన్ కు తెలియదా.. గుర్తు లేదా.. మర్చిపోయారా..?
ఈ లేఖను వెనక్కి తీసుకోవాలని వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ లేఖ రాస్తే.. వైఎస్సార్ పై రాజకీయ విమర్శలు చేస్తూ, టాపిక్ డైవర్ట్ చేసి ప్రత్యుత్తరమిచ్చిన సంగతి పవన్ కి తెలియదా..?
నాడు కాంగ్రెస్ లో ఉండి.. విభజన వల్ల నష్టం లేదని.. రాష్ట్రం విడిపోవడవం వల్ల సీమాంధ్రకు మంచిదే అని.. మరింతగా అభివృద్ది చేసుకోవచ్చని అన్నయ్య చేసిన వ్యాఖ్యలు తమ్ముడుకి గుర్తు లేవా..?
ఇదే సమయంలో… రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు రెండుసార్లు కేంద్రానికి లేఖలు రాశారంటూ విశాఖపట్నంలోని మీట్ ద ప్రెస్ లో చిరంజీవి చెప్పిన విషయం పవన్ కి వినిపించలేదా..?
లోపల రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. బయట మాత్రం ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అంటూ సొల్లు పురాణాలు చెప్పిన నేతల మాటల కోతలు పవన్ కు తెలియదా..?
నాడు నేతలంతా ఇలా తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఏమైపోతేనేం అని నక్క జిత్తుల వేషాలు వేస్తున్న సమయంలో.. “స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్” అంటూ ఎంపీ హోదాలో వైఎస్ జగన్ పార్లమెంటులో ధైర్యంగా ఫ్లకార్డు పట్టుకుని అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగలేదా..?
ఇక రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి రావాల్సిన వాటాలు రాకపోవడం.. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ, పోలవరానికి జాతీయ హోదా అని చెప్పిన మోడీ సర్కార్ ని పాచిపోయిన లడ్డూల బ్యాచ్ అని పవన్ విమర్శించలేదా..?
దానికి భిన్నంగా… ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మాటలు పవన్ మరిచిపోయారా..?

రాష్ట్ర విభజన సమయంలో నాయకులు ఎవరూ ధైర్యంగా మాట్లాడ లేదని, పోరాడ లేదని చెబుతున్నారు పవన్ కల్యాణ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అప్పుడు అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు. ప్రధానంగా చంద్రబాబు పంపిన ఎంపీలతో పాటు స్వయంగా పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి కేంద్ర కెబినెట్ లో మంత్రిగా ఉన్నారు..!
మరోపక్క రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జగన్ పార్లమెంటులో ఫ్లకార్డు పట్టుకుని నిలబడ్డారు. తన వాయిస్ ను సూటిగా చెప్పారు. రాష్ట్రాన్ని విభజించొద్దని నొక్కి చెప్పారు. రెండు కళ్లు, ఒక్క ముక్కు, రెండు చెవులు వంటి సొల్లు కబుర్లు చెప్పలేదు.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే పంథానూ ఎంచుకోలేదు. ఇంతకూ.. అంతక ముందు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ అప్పుడు ఏమి చేస్తున్నారు? కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది సినిమాల మధ్యలో ఉన్నట్లున్నారు..!!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… రాష్ట్ర విభజన సమయంలో ఏమి జరిగింది.. ఏపీకి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, టీడీపీ ఎలాంటి ద్రోహాలు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరుపడితే వాళ్లు రెండు నాలుకలతో నడుచుకుంటూ.. రాష్ట్రానికి.. ప్రధానంగా సీమాంద్ర ప్రజానికానికి ద్రోహం చేశారు. జగన్ మాత్రం విభజనకు వ్యతిరేకంగా తన గళం పార్లమెంట్ లోపల బయటా వినిపించారు. ఒక వేళ ఈ విషయాల్లో ఏమైన సందేహం ఉంటే.. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఫోన్ చేసి పవన్ కల్యాణ్ క్లారిటీ తీసుకోవచ్చు!

అయితే… అవన్నీ ప్రజలు మరిచిపోయి ఉంటారు.. తాను 2024 ఎన్నికల ముందు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు ఎలాగైతే మరిచిపోయి, ప్రశ్నించడం మానేశారో… రాష్ట్ర విభజన నాటి సంగతులను ఏపీ ప్రజానికం మరిచిపోయి ఉంటారని.. చరిత్రను వక్రీకరిస్తూ, తనదైన సొంత కవిత్వ చరిత్రను రాసేపనికి, జెన్-జెడ్ మనసుల్లో నింపే పనికి పూనుకుంటున్నట్లున్నారు పవన్ కల్యాణ్!
ఇది సినిమా కలెక్షన్స్ రికార్డుల చరిత్ర కాదుగా.. ఒకరి తర్వాత ఒకరు తిరిగి రాయడానికి! ఇది రాష్ట్ర చరిత్ర, తెలుగు వారి చరిత్ర, ఏపీ ప్రజానికం హృదయాల్లో నిలిచిపోయిన చరిత్ర. పదికి పాతికకి ఓట్లు వేసే విషయంలో చాలామంది ఈ విషయాన్ని మరిచిపోయి ఉండొచ్చు కానీ.. అసలు సిసలు ఆంధ్రుడు ఏనాడూ మరిచిపోడు. ఈ విషయాన్ని పవన్ మరిచిపోకూడదు. వాపు ఎప్పుడూ బలుపు కాదు.. అడిగేవాళ్లు లేరు కదా అని నోరేసుకుని పడిపోయినంత మాత్రాన్న అబద్ధం నిజం కాదు!!

