పవన్ కళ్యాణ్ విడాకులు.. వైసీపీ, జనసేన.. ఓ రాజకీయ ఉన్మాదం.!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో దాపరికం ఏముంది.? మొదటి వివాహ విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయితో జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆమెతో పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు.

రేణు దేశాయ్‌తో కొన్నాళ్ళు సహజీవనం, ఆ తర్వాత ఆమెతో పెళ్ళి. రేణుదేశాయ్‌ నుంచి కూడా పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రష్యన్ మహిళని పెళ్ళాడారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆమెతోనే జీవిస్తున్నారు కూడా.!

చట్ట ప్రకారం పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ విషయమై వివాదం ఏమీ లేదు. కానీ, రాజకీయంగా ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రత్యర్థుల ఉన్మాదానికి ఇదొక ‘సబ్జెక్ట్’ అయిపోయింది.

ఉన్మాదం వేరే లెవల్..

జనసేన మహిళా నేత రాయపాటి అరుణ ఫొటోతో వైసీపీ మద్దతుదారులైన కొందరు జుగుప్సాకరమైన రాజకీయ క్రీడకు తెరలేపారు. ‘నా భర్త పవన్ కళ్యాణ్‌గారిని ఆదర్శంగా తీసుకుని నాకు విడాకులు ఇచ్చినాసరే నేను ఫీల్ అవను..’ అని ఆమె చెప్పినట్లుగా ఓ మార్ఫింగ్ ఫొటో (మీమ్, థంబ్‌నెయిల్ లాంటిది) తయారు చేసి వదిలారు.

దానికి జనసేన మద్దతుదారుల నుంచి కౌంటర్ ఎటాక్ చేస్తూ, పై కామెంట్‌నే వైఎస్ జగన్ సతీమణి భారతి చేసినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రాయపాటి అరుణ, ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్‌కి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు.

మరి, మహిళా కమిషన్ ఏం చేస్తుంది.? ఇటు వైసీపీ మద్దతుదారుల్ని, అటు జనసేన మద్దతుదారుల్ని అరెస్టు చేయించగలుగుతుందా.?