దేశంలో నరేంద్రమోడీ, అమిత్ షా ఇద్దరూ దొంగలే అని ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సీబీఐలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సీబీఐ ఆఫీసుల ముందు నిరసన తెలపాలన్న ఏఐసీసీ పిలుపు మేరకు వారు విజయవాడలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో రఘువీరారెడ్డి మాట్లాడారు.
రాఫెల్ కుంభకోణానికి సంబంధించి సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి కేంద్రం అలోకవర్మను తప్పించిన నేపధ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ వ్యాప్త నిరసనకు పిలుపు నిచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో ఈ రోజు ఉదయం బందర్ రోడ్డులో నిరసనను తలపెట్టింది. దీంతో పోలీసులు బారీ బందోబస్తును ఆంధ్రరత్నభవన్ వద్ద ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి, ఏఐసిసి కార్యదర్శి మస్తాన్‌వల్లీ, మరియు పిసిసి నాయకులు, వివిధ విభాగాల నాయకులు కృష్ణా, గుంటూరు డిసిసి అధ్యక్షులు తదితరులు ఏపిసిసి రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్నభవన్ నుంచి నిరసనకు బయలుదేరుతుండగానే గేటు వద్దనే పోలీసులు రఘువీరారెడ్డి, తదితరులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తల మద్య కొద్ది సేపు తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు, ఏపిసిసి అధ్యక్షులు డాక్టర్ .ఎన్.రఘువీరారెడ్డి, ఏఐసిసి కార్యదర్శి మస్తాన్ వల్లీ, తదితరులను బలవంతంగా అదుపులోకి తీసుకుని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దీంతో స్టేషన్‌లో రఘువీరారెడ్డి తదితరలు స్టేషన్‌లో బైఠాయించి, నిరసన వ్యక్తం చేయడంతో,రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు… మధ్యాహ్నం రఘువీరారెడ్డి, తదితరులను విడుదల చేసిన అనంతరం భవానీపురం పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు..
ఏఐసిసి పిలుపు మేరకు ఏపిసిసి అధ్వర్యంలో సీబీఐ కార్యాలయాల దగ్గర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఏపిసిసి నాయకులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొనడానికి బయలుదేరుతుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రఘువీరారెడ్డి అన్నారు.
ఈ రోజు ప్రజాధనం దోపిడి జరుగుతోందని, రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని, నరేంద్రమోడీ చేతుల్లో రాజ్యాంగం ఆవిరయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకోసమే ఈ రోజు ఈ నిరసన చేపట్టామన్నారు. అర్ధరాత్రి 2.00 గంటలకు సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను ఉన్న ఫలంగా ఆ పదవి నుంచి తప్పించి మరోకరిని నియమించడం అనేది రాజ్యాంగ విరుద్దమన్నారు.
అలోక్ మీద ఎటువంటి ఆరోపణలు లేవని, ఉన్నా కూడా అతన్ని తప్పించడానికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్, ప్రధానమంత్రి, లోక్‌సభలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు. ఈ ముగ్గురితో కూడుకున్న కమిటీ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కానీ అవేమీ లేకుండా నేరుగా ప్రధానమంత్రి, అమిత్‌షా ఏకపక్ష నిర్ణయంతో తప్పించారన్నారు. ఎందుకంటే రాఫెల్ యుద్ధ విమానాల్లో దొంగలుగా తేలింది నరేంద్రమోడీ, అమిత్‌షా అని, వారిద్దరూ దోపిడిదారులు, దొంగలని అన్నారు.
ప్రస్తుతం ఉన్న సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ అవుతుందని గమనించారని, సీబీఐ విచారణ జరగాలని దేశం మొత్తం మీద డిమాండ్‌లు పెరుగుతున్నాయని అన్నారు. కీలకమైన పత్రాలు అలోక్ వర్మ దగ్గర ఉన్నాయని తెలుసుకుని అతన్ని ఉన్నఫలంగా షిఫ్ట్ చేయడం జరిగిందన్నారు. ఇది రాజ్యాంగాన్ని చంపడేనన్నారు.
మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల్లో రెండు నేరాలు చేశారని, ఒకటి గత కాంగ్రెస్ హయంలో రాఫెల్ యుద్ద విమానాలు కొనుగోలు హెచ్ఎఎల్ ద్వారా జరగాలని, దాన్ని తప్పించి మోడీకి ప్రియ మిత్రులైన అనిల్ అంబానీకి అప్పచెప్పారన్నారు. ఈ దేశ యుద్ద విమానాలకు సంబంధించి అనిల్ అంబానీకి ఏ మాత్రం అనుభవం లేదన్నారు. రెండోవది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం. రూ.41 వేల కోట్లు అంబానీకి అప్పనంగా అప్పచెప్పె పెద్ద కుంభకోణమే ఈ రాఫెల్ స్కామ్ అని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఒక్కోక్కొ యుద్ద విమానం రూ.526 కోట్లు ఒప్పందం చేసుకుంటే, అదే యుద్ద విమానాన్ని ఈ రోజు రూ.1670 కోట్లు. అంటే ఒక్కొక్క యుద్ద విమానం మీద రూ.1100 కోట్లు ఇద్దరూ కుమ్మక్కై దోచేస్తున్నారు. ఇందులో వేరే ఎవరూ దోషులు కాదని, సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌షాలే దొంగలు, దోపిడీ దారులు అని అన్నారు. ఈ రాఫెల్ యుద్ద విమానాల కుంభకోణం మీద మాట్లాడే, ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద లీగల్ నోటీసులు పంపిస్తున్నారని అన్నారు.
పత్రికలకు, టీవీ ఛానల్స్ కు లీగల్ నోలీసులు పంపిస్తున్నారని, రాహుల్‌గాంధీతో మొదలుకొని మా అందరికీ లీగల్ నోటీసులు పంపించారన్నారు. పరువు నష్టం దావా వేస్తామన్నారని, దీనికి ఎవరైనా భయపడతారేమో కానీ కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు.ఈ రోజు మీరు సీబీఐ నోరు మూయవచ్చని, మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం జరిగితే 40 సీబీఐ అధికారులను రాత్రికి రాత్రే ట్రాన్స్ ఫర్ చేయించిన చరిత్ర మీదన్నారు. సాక్షులుగా ఉన్న 100 మందిని బీజేపీ హత్య చేసిందని, మీకేమీ కొత్త కాదని, సీబీఐని మీ ఆట వస్తువుగా వాడుకోనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఈ రోజు ఒక నీజాయితీ పరుడుగా ఉన్న సీబీఐ డైరెక్టర్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీబీఐను, ఆర్బీఐను, న్యాయ వ్యవస్థను, పార్లమెంట్ వ్యవస్థను, రాజ్యాంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ ఆరు నెలలు మాత్రమే నిర్వీర్యం చేయవచ్చునని, తరువాత ప్రజల నుంచి తప్పించుకోలేరన్నారు. ఇంత వరకు మీరు స్వచ్ఛభారత్, స్వచ్ఛప్రభుత్వం అని చెప్పుకుంటున్నారని, అవినీతి ప్రభుత్వం, అవినీతి సామ్రాట్ నరేంద్రమోడీ అని నిరూపణ అయ్యిందన్నారు.
మీరు వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఎందుకు వేయరూ…కారణం మీరు దోషిగా నిరూపణ చేస్తుంది ఆ కమిటీ అని అన్నారు. మీ పార్టీకి సంబంధించిన వారే ఈ రోజు సీబీఐ దర్యాప్తు, న్యాయ విచారణ జరగాలని సుప్రీం కోర్టుకు ఎక్కారన్నారు. అలోక్ వర్మను తప్పించడం సరైంది కాదని వేరే వాళ్లు కాదని, మీ పార్టీ వారే సుబ్రమణ్యం సూచిస్తున్నారని అన్నారు.
బయటే కాదు ముసలం మీ పార్టీలో కూడా మొదలైందని, మోడీ ముక్త్, అమిత్‌షా ముక్త్, భారతీయ జనతా పార్టీ కావాలని మీ పార్టీలో వాళ్లే కోరుతున్నారన్నారు. జాగ్రత్త ఇది ప్రజల సొమ్మును దోచుకుంటా ఉంటే చూస్తూ కూర్చోవడానికి మేము తయారుగా లేమన్నారు. మీరు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని, లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మీరు రాజ్యాంగ వ్యవస్థను చంపుతా ఉంటే ఈ భారతదేశమే పునారిల్లిపోతుందన్నారు. భారతదేశం బలహీనపడటానికి వీల్లేదని, భారత రాజ్యాంగ సంస్థలు బలహీన పడితే, ఈ దేశం బలహీన పడుతుందన్నారు. వాటిని రక్షించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆరాటమన్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్క విచారణకు ముందుకు రారు…కాంగ్రెస్ హయాంలో ఏ ఆరోపణలు వచ్చినా విచారణలు చేశామన్నారు.
వెంటనే మీరు రాజీనామా చేయాలని, లేదంటే ప్రజలందరూ చూస్తున్నారని, కచ్చితంగా గద్దె దింపడం ఖాయమన్నారు. గద్దె దింపిన వెంటనే విచారణ చేసి మీరు దోషిగా నిరూపించి మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపడం గ్యారెంటీ అని అన్నారు. మీరిద్దరూ స్నేహితులు. మీరిద్దరూ కలిసే ఉండాలని, మీ ఇద్దరిని జైలుకు పంపే వరకు భారతదేశ పౌరులు వదలరని, కాంగ్రెస్ పార్టీ అంత వరకు పోరాటం చేస్తుందన్నారు.