చంద్రబాబును పనికిమాలినవాడని నిందిస్తున్న రాధాకృష్ణ

Radhakrishna accuses Chandrababu of being useless
Radhakrishna accuses Chandrababu of being useless
Radhakrishna Chandrababu

ఆత్మస్తుతి పరనింద నానుడిని అమలు చెయ్యడంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డాక్టరేట్ చేసి ఉండవచ్చు. తన సామాజికవర్గం వారు ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్ని నేరాలు చేసినప్పటికీ, ఎంత ప్రజాద్రోహానికి ఒడిగట్టినప్పటికీ వారిని పన్నెత్తి విమర్శించరు. వారి దోషాలను ఎత్తి చూపరు. శాశ్వతం అనుకున్న అధికారం మంచుముద్దలా కళ్ళముందే కరిగిపోవడం, చంద్రబాబు అయిదేళ్ల పాలనలో వందలాదికోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత ఏడాదిన్నరగా దోచుకోవడానికి అవకాశం మలిగిపోవడం, పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం అత్యంత పేలవమైన ప్రదర్శన చేసి పరువు పోగొట్టుకోవడం, చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా చెమటలు కక్కుతూ రోడ్ల మీద తిరుగుతూ పిచ్చిమాటలు మాట్లాడుతూ నవ్వులపాలు కావడం, తెలుగుదేశం బడా నాయకులంతా ఫ్రస్ట్రేషన్ కు లోనై నిస్పృహలో కూరుకునిపోవడం, అమరావతిలోని తన సామాజికవర్గం వారి లక్షలకోట్ల సంపద నీరుగారిపోవడం, అమరావతి ఉద్యమానికి ఎంత బాకాలు ఊదినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పాపం..రాధాకృష్ణ కూడా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ కు లోనై ప్రతి వారం ఒకసారి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లకపోతే బ్రతకలేనేమో అన్నట్లు వాంతులు చేసుకుంటున్నాడు!

నిజానికి చంద్రబాబుకు రాధాకృష్ణ రాజగురువులాంటివాడు. నలభై ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు, జాతీయస్థాయిలో చక్రాలు తిప్పిన చంద్రబాబు…రాష్ట్రపతులు, ప్రధానమంత్రులను ఈ దేశానికి అందించిన చంద్రబాబు…నేడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఏ అనుభవమూ లేని యువకిశోరం ముందు చిత్తు చిత్తుగా, పనికిమాలిన సత్తురూపాయిలా, సీరియల్ నంబర్ చినిగిపోయిన కరెన్సీ నోటులా, చెల్లని కాసులా, పీకేసిన గడ్డిపోచలా తయారయ్యాడే అనే ఆక్రోశాన్ని ఆవేదనను ఏమాత్రం భరించలేక వలవల మొత్తుకుంటున్నాడు! అందుకే ఒక భారతంలోని ఒక ఉపకథను వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే ఆంధ్రదేశంలో కలిపురుషుడి ప్రవేశించాడు అని తీర్మానించారు! యుగాంతధర్మానికి విరుద్ధంగా కలిపురుషుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాలు పెట్టాడని రాధాకృష్ణగారి కవిసమయంగా మనం భాష్యం చెప్పుకోవాలి.

రాధాకృష్ణ బాధ ఏమిటి? జగన్ మోహన్ రెడ్డి రాజాకీయ వ్యూహాలముందు చంద్రబాబు ఓడిపోయాడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతగానివాడుగా మిగిలిపోయారు. అభివృద్ధి నమూనానే నమ్ముకున్న చంద్రబాబు 2004లో ఒకసారి, 2019లో మరోసారి ఘోరంగా ఓడిపోయారు. జగన్‌ రెడ్డి విసిరిన ఉచ్చులో చిక్కుకున్నచంద్రబాబు ప్రత్యేక హోదా కోసం తన పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులతో రాజీనామా చేయించారు. ఎన్నికలలో గెలుపొందడానికి అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేశారు. చంద్రబాబు ఒంటరిగా మిగిలిపోయారు.

అంటే ఏమిటి? చంద్రబాబునాయుడు చేతకానివాడైపోయాడు అని రాధాకృష్ణ ఒప్పుకుంటున్నాడు. 2004 నాటికి తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతికే నిర్వచనం చెప్పాడు. రెండెకరాల ఆస్తి ఉన్న ఆయన రెండువేలకోట్ల రూపాయలకు పడగెత్తాడని నాటి తెహల్కా డాట్ కామ్ ప్రకటించింది. మరి ఎలా సాధ్యమయిందో మరి? యాభై అయిదు ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి చంద్రబాబు చేసిన అభివృద్ధిని భరించలేక ఘోరంగా తరిమికొట్టారు అప్పుడు. పోనీ అప్పటినుంచైనా జ్ఞానం తెచ్చుకుని మారిపోయాడా అంటే లేదు. 2014 లో అధికారంలోకి రాగానే మళ్ళీ అమరావతి పేరుతో లక్షలకోట్ల రూపాయల దోపిడీకి తెగబడ్డాడు. రాధాకృష్ణ, రామోజీరావు లాంటి భజంత్రీల పుణ్యమా అని చంద్రబాబు చేసిన అభివృద్ధి ఆకాశాన్ని అంటింది. కానీ ప్రజల కళ్ళకు కనిపించకపోవడంతో చావగొట్టి చెవులు మూసేశారు.

ఇక ప్రత్యేకహోదా పదేళ్ళపాటు తెస్తామని ఆర్బాటంగా తిరుపతి సభలో ప్రకటించిన చంద్రబాబు తరువాత ఆ మాటే మరిచిపోయి పాకేజీకి ఆశపడ్డారు. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం వచ్చింది లేదు. ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు. ఒక్క ప్రాజెక్ట్ కట్టింది లేదు…ఏమీ లేకుండానే మూడులక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేసారు. దాంతో మళ్ళీ చంద్రబాబును ప్రజలు తరిమేశారు.

వాస్తవాలు ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి మాయచేశారు..మంత్రం వేశారు…అని ఏడిస్తే ఏమి ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి విసిరిన ఉచ్చులో చంద్రబాబు చిక్కడం అంటే చంద్రబాబు పరమ అవివేకి అని అర్ధం కావడం లేదూ? అలాంటి అవివేకికి అసలు పాలించే అర్హత ఎలా ఉంటుంది?

ఇక రాజీనామా చేస్తే ఏమి ప్రయోజనం అని విజయసాయిరెడ్డి అన్నారట. అలా చెప్పడం చంద్రబాబుకు చేతకాలేదట! అవును మరి! విజయసాయిరెడ్డి కల్మషం లేని రాజకీయమేధావి. అందుకే ఆయన రాజకీయ కోణంలో కాకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు. చంద్రబాబు మహా మేధావి కాబట్టే అప్పట్లో పార్లమెంట్ లో తన ఎంపీలకు రకరకాల వేషాలు వేయించి వీధిభాగవతాలను ప్రదర్శించి ప్రజలను వంచించారు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలలో మోసం చేశారని అభాండాలు వేస్తున్న రాధాకృష్ణ తన సామాజికవర్గ ఘరానా మోసగాళ్లు సుజనాచౌదరి, రాయపాటి సాంబశివరావు చౌదరి ఎన్ని వేలకోట్ల రూపాయలకు బ్యాంకులకు టోపీ పెట్టారో, దర్యాప్తు సంస్థల వేట నుంచి తప్పించుకోవడానికి సి ఎం రమేష్, సుజనా చౌదరి బీజేపీ ముసుగులు ఎలా కప్పుకున్నారో కూడా ఒక వాక్యం రాస్తే బాగుండేది!

మొత్తానికి చూస్తే చంద్రబాబు చాలా తెలివితక్కువవాడని, మహా అసమర్థుడని, ఎందుకూ పనికిరానివాడని, రాజకీయపుటెత్తుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి ముందు దేనికీ కొరగాడని, ఈకాలపు రాజకీయాలకు అసలు సరిపోడని అంగీకరించారు. మహా సంతోషం. అందుకే ఆయన్ను అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని జగన్మోహన్ రెడ్డి ఏనాడో వర్ణించాడు. ఇక “డర్టీఎస్ట్ పొలిటీషియన్ అఫ్ ఇండియా” అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ళక్రితమే సర్టిఫికెట్ ఇచ్చేసారు! తెలుగుదేశం పార్టీ అంత నికృష్టమైన పార్టీ మరొకటి లేదని నిన్నటి పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. చంద్రబాబుగారికి అంతకన్నా ఇంకేమి కావాలి?

ఇలపావులూరి మురళీ మోహన రావు

సీనియర్ రాజకీయ
విశ్లేషకులు