తిరుపతిలో సోమిరెడ్డి టీడీపీని గట్టేక్కిస్తాడా ?

తిరుపతిలో అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీని గెలిపించే బాధ్యత చంద్రబాబునాయుడు ఓ సీనియర్ నేతపై ఉంచారు. ఇంతకీ ఆయనెవరయ్యా అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గెలుపు బాధ్యతను సోమిరెడ్డికి అప్పగించినట్లు చంద్రబాబు ప్రకటించగానే పార్టీలో అందరు ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటంటే సోమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి దాదాపు పాతికేళ్ళవుతోంది. 1999లో చివరిసారిగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచారు.

ఆ తర్వాత నుండి ప్రతి ఎన్నికలోను పోటీ చేయటం, ఓడిపోవటమే. 2004, 2009, 2014, 2019 వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి నిజానికి గెలుపుకు చాలా దూరమైపోయారు. 2014లో ఓడిపోయిన సోమిరెడ్డికి ఎంఎల్సీ ఇఛ్చి చంద్రబాబు మంత్రిని చేశారు. ఇన్ని ఎన్నికల్లో వరసగా ఓడిపోతున్నారంటే ఆయనకున్న ఇమేజి, పట్టు ఏమిటో అర్ధమైపోతోంది. అలాంటి సీనియర్ నేతకు తిరుపతి పార్లమెంటు గెలిపించేత సీన్ లేదని అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయం చంద్రబాబుకు తెలీదా అంటే తెలుసు, అయినా సోమిరెడ్డికే బాధ్యత అప్పగించారు. అందుకనే పార్టీలోని నేతలంతా అంతగా ఆశ్చర్యపోయింది.

తన నియోజకవర్గంలోనే గెలవలేని సోమిరెడ్డి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని ఎలా గెలిపించగలరు. అసలే అధికార పార్టీ బాహుబలి స్ధాయిలో చాలా బలంగా ఉంది. పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో వరుస గెలుపుతో ఆ విషయం అందరికీ అర్ధమైపోయింది. ఇదే సమయంలో టీడీపీతో కలుపుకుని ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా బలహీనంగా ఉన్నాయి. ఉన్నంతలో టీడీపీని కొంతమెరుగనే స్ధితిలో ఉంది. ఇలాంటి నేపధ్యంలో వచ్చిన ఉపఎన్నికలో పార్టీని గెలిపించే బాధ్యత అప్పగించే విషయంలో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా ఉండాలి. బహుశా తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమిరెడ్డే మెరుగైన నేతని చంద్రబాబు అనుకున్నారో ఏమో.