కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థి ఫిక్స్… బాబుతో సంబంధం లేదు!

ఏపీ రాజకీయాల్లో కీలకమైన నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి అనడంలో సందేహం లేదు. ఈసారి కుప్పంలోనూ, మంగళగిరిలోనూ గెలవడం ఎంత ముఖ్యమో.. గుడివాడలో కొడాలి నాని ఓడించడం అంతకంటే ముఖ్యం అనే స్థాయిలో చంద్రబాబు పావులు కదుపుతున్నారనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో తానే టీడీపీ అభ్యర్థి అని ఫిక్సయిపోయారు గుడివాడ తమ్ముడు ఒకరు!

అవును… గుడివాడలో కొడాలి నానిపై టీడీపీ నేతలకు, ముఖ్యంగా చంద్రబాబుకు ఏ స్థాయిలో ఆగ్రహం ఉందనేది తెలిసిన విషయమే. పైగా టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరగడంలో కొడాలి స్టైలే వేరని అంటుంటారు వైసీపీ నేతలు. దీంతో గుడివాడలో కొడాలిపై కీలక అభ్యర్థిని పోటీకి దింపాలని బాబు రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ సందర్భంగా గుడివాడదలో కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగేది తానే అని ప్రకటించుకున్నారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. పైగా ఇదే విషయాన్ని సార్‌కు నా మాటగా స్పష్టంగా చెప్పండి అంటూ టీడీపీ పెద్దలకు తేల్చి చెప్పారని తెలుస్తుంది. దీంతో గుడివాడ టీడీపీలో కొత్త అలజడి రేగిందని అంటున్నారు. దీంతో టీడీపీ రాష్ట అధ్యక్షుడు కె.అచ్చన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరించారు.

దీంతో గుడివాడ సీటు తనదే అని ఎన్నో ఆశలతో అమెరికానుంచి వచ్చిన వెనిగండ్ల రాము ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఇప్పటికే గుడివాడ టీడీపీ టిక్కెట్ తనదే అని నమ్మి రాము ఎంతో ఖర్చు పెట్టారని అంటున్నారు. ఆయన సతీమణి కూడా నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలు చేశారని చెబుతున్నారు. ఇలా సడన్ గా రావి వెంకటేశ్వర్ రావు రూపంలో సమస్య రావడంతో చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నారని సమాచారం.

అయితే… ఇలాంటి విషయాల్లో మౌనాన్నే తన భాషగా చేసుకునే అలవాటున్న చంద్రబాబు… గుడివాడ విషయంలో కూడా మౌనంగా ఉంటూ, రాము ఫోన్ కు పలకడం లేదని చెబుతున్నారు. దీంతో వెనిగండ్ల రాము పునరాలోచనలో పడ్డారని… తిరిగి అమెరికా వెళ్లిపొవడమే బెటరా అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రధానంగా లోకేష్‌ ఆశీస్సులే రాముకు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్న నేపథ్యంలో చివరిగా ఒకసారి చినబాబును కూడా కలిసి మాట్లాడాలని భావిస్తున్నారంట.

మరోపక్క మాజీ ఎమ్మెల్యే రావి మాత్రం… ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తుంది. రావికి ఈసారి టిక్కేట్ ఇవ్వకపోతే టీడీపీ ఓటమికి పనిచేస్తామని ఆయన వర్గం అంటున్నారని సమాచారం. మరి ఈ పరిస్థితుల్లో ఉన్న గుడివాడ పరిస్థితిని చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారు.. ఎలా ఈ గండం నుంచి గట్టేక్కుతారు అనేది వేచి చూడాలి.