విశాఖ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం వైపు చూస్తున్నారన్నది తాజా ఖబర్. పార్లమెంటుకు కాకుండా, పురంధీశ్వరి అసెంబ్లీకి పోటీ చేయడమేంటబ్బా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
తిరుపతి అయితే సేఫ్ జోన్ అని పురంధీశ్వరి భావిస్తున్నారట. చిత్రమేంటంటే, ఇదే నియోజకవర్గం నుంచి జనసేనాని పోటీ చేయాలంటూ, జనసేన నేతలు కొందరు తమ అభిప్రాయాల్ని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. తిరుపతి టిక్కెట్టుపై జనసేన నేత కిరణ్ రాయల్ చాలా ఆశలే పెట్టుకున్నారు.
కానీ, దగ్గుబాటి పురంధీశ్వరి రంగంలోకి దిగేసరికి, కిరణ్ రాయల్ పరిస్థితి అయోమయంలో పడక తప్పదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే, పురంధీశ్వరిని లోక్ సభకే పంపాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందట. ఒకవేళ తిరుపతి అసెంబ్లీకి పోటీ చేసినా, ఆమె రాష్ట్రంలో ఏదో ఒక లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారన్నది ఇంకో ప్రచారం.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమే. ఈ నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ కర్చీఫ్ వేసిందని అనుకోవచ్చు. మరి, ఇదే నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న జనసేన సంగతేంటి.?
బీజేపీ, జనసేనతో పోల్చితే, తిరుపతిలో టీడీపీనే బలంగా వుందన్నది బహిరంగ రమస్యం. కానీ, బీజేపీ – జనసేనతో పొత్తు నేపథ్యంలో, టీడీపీ ఈ సీటుని త్యాగం చెయ్యాల్సిందేనేమో.! కాగా, తిరుపతి నియోజకవర్గంపై వైసీపీ పూర్తి ధీమాతో వుంది.