ప్రాజెక్టులూ.. చంద్రబాబూ.. పబ్లిసిటీ స్టంట్లూ.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి, ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు బాధ్యతలు గుర్తుకొస్తాయ్.! అదే అధికారంలో వుంటే మాత్రం, కేవలం పబ్లిసిటీ స్టంట్స్‌తో టైమ్ పాస్ చేసేస్తుంటారు. అధికారంలో వున్నా, లేకపోయినా.. పబ్లిసిటీ స్టంట్లు మాత్రం ఖాయం.!

2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోనూ తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం.

గత కొద్ది రోజులుగా ప్రాజెక్టుల సందర్శన.. అంటూ కొత్త పంచాయితీ మొదలెట్టారు చంద్రబాబు. మొత్తంగా అధికారంలో వున్న పధ్నాలుగేళ్ళలో పట్టించుకోని ప్రాజెక్టుల మీద ఇప్పుడు.. తీరిగ్గా ఆయన పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడం ఆశ్చర్యకరం.

నాలుగేళ్ళుగా వైఎస్ జగన్, పోలవరం ప్రాజెక్టు సహా, రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదన్నది చంద్రబాబు ఉవాచ. తాను ముఖ్యమంత్రిగా వున్న, ఐదేళ్ళ కాలంలో (అంతకు ముందు తొమ్మిదేళ్ళు పక్కన పెట్టేద్దాం..) చంద్రబాబు ఏం చేసినట్లు.?

రాష్ట్రాన్ని చంద్రబాబే పూర్తిగా ఉద్ధరించేసి వుంటే, ఈ రోజు ప్రాజెక్టుల పేరుతోనో.. ఇంకో పేరుతోనో.. ఎవర్నీ విమర్శించాల్సిన అవసరమే వుండదు కదా.? టీడీపీ – బీజేపీ కలిసే అధికారంలో వున్నాయి 2014 నుంచి 2018 వరకు. మరి, ఆ కాలంలో పోలవరం ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేకపోయారు.?

జనం అన్నీ మర్చిపోతారనీ.. తమ పబ్లిసిటీ స్టంట్లకు ముగ్ధులైపోతారనీ చంద్రబాబు భావించడం కొత్తేమీ కాదు. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.