సర్పంచ్ గా పోటి చేయాలని ఒత్తిడి, వివాహిత ఆత్మహత్య

సర్పంచ్ గా పోటి చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు అదనపు కట్నం 5 లక్షల రూపాయలు తేవాలని భర్త వేధించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.

నల్లగొండ జిల్లా డిండి మండలం నిజాం నగర్ కు చెందిన రాధను అదే మండలం ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగయ్యకు ఇచ్చి ఎనిమిది నెలల కింద వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో బైక్ ను రాధ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దానిని ఇంత వరకు ఇవ్వలేదు. దీంతో తరచు లింగయ్య బైక్ కోస్ రాధను వేధించేవాడు.

ఇంతలో ఎర్రగుంటపల్లి సర్పంచ్ ఎస్పీ మహిళకు రిజర్వ్ అయ్యింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటి చేయాలని అమ్మగారింటి దగ్గర నుంచి కట్నంగా మరో 5 లక్షల రూపాయలు తీసుకురావాలని రాధను వేధించసాగాడు. దీంతో పుట్టింటికి వెళ్లిన రాధ విషయం చెప్పి కన్నీరు మున్నీరయ్యింది. సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద మనుషులల్లో పెట్టి మాట్లాడుదామని తల్లిదండ్రులు రాధను ఓదార్చారు.

తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి రాధ ఆత్మహత్యకు పాల్పడింది. సర్పంచ్ పోటి ఓ వివాహిత ప్రాణాన్ని తీసిందని అంతా విచారం వ్యక్తం చేశారు. పోలీసులు లింగయ్యను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.