ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ జాతీయ అధ్యక్షు చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబును కుప్పం రానివ్వమని సవాల్ చేసిన వైసీపీ నేతలు.. ఆయన్ను అడ్డుకునేందుకు కూడా యత్నించారు. దీంతో కుప్పంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొదటిరోజు బాబు పర్యటన సాఫీగానే జరిగింది. ఐతే రెండో రోజు పర్యటన సందర్భంగా కలకలం రేగింది. చంద్రబాబు బస చేసిన కుప్పంలోని ఆర్ఆండ్బీ గెస్ట్ హౌస్ కు విద్యుత్ సరఫరా నిలిపివేయడం చర్చనీయాంశమైంది.
గంటకుపైగా కరెంట్ లేకపోవడం, జనరేటర్ కూడా అందుబాటులో ఉంచకపోవడంతో అధికారులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు సృష్టించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఉన్న సమయంలోనే కరెంట్ కట్ చేయడం దారణమని.. ఇది కక్ష సాధింపు చర్యేనని టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మండిపడ్డారు. గెస్ట్ హౌస్ కు కావాలనే కరెంట్ కట్ చేశారన్న అమరనాథ్ రెడ్డి, కనీసం జనరేటర్, బ్యాటరీ కూడా ఇవ్వలేదన్నారు. రాబోయే రోజుల్లో తాము కూడా షాక్ లు ఇస్తామంటూ హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని.. చంద్రబాబు పర్యటనలో ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. గతంలో ఎప్పుడూ జరగని ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయని విమర్శించారు. ఐతే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందా.. లేక మరేదైన కారణం వల్లా అనేది మాత్రం తెలియలేదు. మరోవైపు కుప్పంలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు మొదటిరోజు కుప్పం, గుడుపల్లె మండలాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇవాళ శాంతిపురం మండలంలో పర్యటిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పార్టీ బలోపేతంపై స్థానిక నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు