(బిపి కుమార్ )
రాజకీయాలను ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మలచుకుని వ్యూహాలు రచించే చంద్రబాబు ఈసారి ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయంలో తన వ్యవూహానికి సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద ఆయనకేం గొప్ప గౌరవమేమీ లేదు. అయితే, ఆకుటుంబం మీద తన గ్రిప్ పోకుండా ఎపుడూ జాగ్రత్త పడతాడు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలంగాణ ఎన్నికల బరిలో దించి, తన రాజకీయాలలో బంధించాలని నిర్ణయించారు.
కూకట్‌పల్లి నియోజకవర్గం టికెట్‌ను ఆమెకు ఖరారు చేశారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని పోటీకి దింపడం ద్వారా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి కొంత ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఇంతకంటే బలమయిన కారణం మరొకటుంది. అది చంద్రబాబు మార్క్ రాజకీయం. తనంటే అంటీ అంటనట్లుంటున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు తనకు దూరంగా జరిగి ఇబ్బందలు పెట్టకుండా హరికృష్ణ కుటుంబ సభ్యలను ఇరుకునపడేశారు.
నిజానికి ఈ సీటును హరికృష్ణ కొడుకు సినీ హీరో కళ్యాణ్‌రామ్‌కు ఇవ్వాలని చూశారు. కళ్యాణ్ కు ఈ సమాచారం పంపి, వప్పించేందుకు కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి కూడా తెచ్చారు. కళ్యాణ్‌రామ్ మాత్రం చంద్రబాబు ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. తాను పోటీ చేయనని స్పష్టంగా చెప్పారు. దీనితో చంద్రబాబు తన వ్యూహ చతురతను ఉపయోగించి అతని సోదరిని తెరపైకి తెచ్చారు. ఇది ఒకరకంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఊహించని పరిణామమే.
ఎప్పటి నుంచో తన మీద గుర్రుగా ఉన్న నందమూరి హరికృష్ణ మృతి చెందినప్పుడు ఆయన కుటుంబాన్ని దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ ఆయన కొడుకులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు అందుకు విముఖత చూపారు. కళ్యాణ్‌రామ్‌ను ఆయన తండ్రి స్థానంలో పార్టీ పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ చంద్రబాబు వలలో కళ్యాణ్‌రామ్ పడలేదు.
ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చినా చంద్రబాబు ఎత్తుల్లో చిత్తయి తన తండ్రి హరికృష్ణ రాజకీయంగా ఒంటరయ్యారనే బాధ కళ్యాణ్‌రామ్‌తోపాటు అతని కుటుంబంలో ఉంది. తనను అవసరానికి వాడుకుని వదిలేశారని, రాజకీయంగా ఎదగనివ్వకుండా చేశారని హరికృష్ణ తాను బ్రతికున్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పేవారు. హరికృష్ణలాగే ఆయన కొడుకు జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికల్లో చంద్రబాబు ఉపయోగించుకుని ఆ తర్వాత పక్కనపెట్టేశారు. ఇవన్నీ హరికృష్ణ కుటుంబంలో చంద్రబాబు పట్ల వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. హరికృష్ణ మృతిచెందినప్పుడు ఆయన మృతదేహాన్ని టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకెళ్లేందుకు వారు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే కళ్యాణ్‌రామ్‌ను ఎలాగైనా తన బుట్టలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో బాబు అతని అక్క సుహాసిని రంగంలోకి దించి ఊహించని షాక్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలైన సుహాసిని హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. పార్టీ యాంగిల్‌లో చక్రం తిప్పి ఆమెను పోటీకి ఒప్పించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు ప్రయోజనాలను ఆశించి సుహాసినిని చంద్రబాబు తెరపైకి తెచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ ఫ్యామిలీని తాను నిర్లక్ష్యం చేయలేదని, హరికృష్ణ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమర్థించుకోవచ్చు. రెండోది తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ సెంటిమెంట్‌ను కొంతవరకైనా ఉపయోగించుకోవడం, హరికృష్ణపై ఉన్న సానుభూతిని ఉపయోగించుకోవడం. వీటన్నింటికీ మించి హరికృష్ణ ఫ్యామిలీ తన చేయి దాటిపోకుండా ఉండేందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లకు చెక్‌పెట్టేందుకు సుహాసినిని రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది.