ఏపీలో గోడమీద బొమ్మ రాజకీయాలు!

తెలంగాణలో నిన్నమొన్నటివరకూ బీఆరెస్స్ – బీజేపీ మధ్య పోస్టర్స్, ఫ్లెక్సీ వార్ నడిచింది. మోడీని టారెగ్ట్ చేస్తూ బీఆరెస్స్ నేతలు హైదరబాద్ లో ఫ్లెక్సీలు, పోస్టర్లు అంటిస్తే… కవిత ఫోటోలతో బీజేపీ నేతలు వ్యంగ్యంగా పోస్టర్లు అంటించారు. ఆ సంగతులు అలా ఉంటే… ఇప్పుడు తాజాగా ఏపీలో స్టిక్కర్ల రాజకీయం నడుస్తోంది. ఏపార్టీకాపార్టీ ఒక్కో రకం స్టిక్కర్ రెడీ చేసుకుని ఇళ్లమీద పడుతున్నారు!

అవును… ఏపీలో ప్రస్తుతం స్టిక్కర్ల రాజకీయం నడుస్తోంది. “మా నమ్మకం నువ్వే జగన్” అంటూ వైసీపీ జగన్ ఫోటోలతో కూడిన స్టిక్కర్స్ అంటించడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి కౌంటర్ గా జనసేన “మా నమ్మకం పవన్ – మాకు వద్దు జగన్” అంటూ కొత్త స్టిక్కర్లతో రెడీ అయ్యింది. సరిగ్గా జగన్ స్టిక్కర్లపైనే వాటిని అంటిస్తున్న జనసైనికులు.. వైసీపీ నేతలపై కవ్వింపుచర్యలకు పాల్పడుతున్నారు.

వీరిద్దరికీ తోడుగా ఇప్పుడు టీడీపీ కూడా రంగంలోకి దిగింది. “మీరే మా గౌరవం – మీతోనే రాష్ట్ర అభివృద్ధి” అంటూ చంద్రబాబు ఫొటోలతో స్టిక్కర్లు రెడీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వీటిని గోడలపై అంటించబోతున్నారట. తాము ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుని.. అనుమతి తీసుకుని స్టిక్కర్లు అంటించి వస్తుంటే.. అటు ప్రతిపక్ష నేతలు మరుసటి రోజు వెళ్లి వాటిపై తమ స్టిక్కర్లు వేసి వస్తున్నారని ఆందోళన చెందుతున్నారంట. దీంతో అసలు ఏ ఇంటికి ఏ స్టిక్కర్ పడిందో.. ఎవరు వైసీపీకి అనుకూలమో.. ఎవరు ఏ పార్టీకి వ్యతిరేకమో తెలియని పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేస్తున్నారంట వైసీపీ నేతలు.

అవును… వైసీపీ జనాలు ఉదయాన్నే ఇంటింటికీ తిరిగి కష్టపడి వారి అనుమతి తీసుకుని స్టిక్కర్లు వేసి వెళ్తుంటే.. ఆ రోజు సాయంత్రమో, ఆ తర్వాతి రోజో… ఎవరి అనుమతి లేకుండానే జనసేన, టీడీపీ నేతలు వచ్చి ఆ స్టిక్కర్లపై తమ సిట్క్కర్లు అంటించి వెళ్లున్నారంట. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి గొడవలూ జరగకపోయినా… ఇదే కంటిన్యూ అయితే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట.