అరరె.! ఏపీ సీఎం జగన్‌కి ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యతనిచ్చారే.!

మళ్ళీ సోషల్ మీడియాలో రాజకీయ రచ్చ మొదలైంది. ఈసారి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యతనిచ్చారనే పేరుతో.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీకి వెళ్ళారు.. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాగిన నీతి అయోగ్ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొనగా, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు.. నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించినట్లు ముందే ప్రకటించారు కూడా.

కొన్నాళ్ళ క్రితం, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే.. ముఖ్యమంత్రి కేసీయార్, ప్రోటోకాల్ పాటించలేదనీ.. ప్రధానికి సముచిత గౌరవం ఇవ్వలేదనీ విమర్శలు వచ్చాయి. తెలంగాణ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీకి (భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ కోసం వెళ్ళారు), ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. ఢిల్లీకి తిరిగి వెళుతూ, వైఎస్ జగన్ భుజం తట్టారు మోడీ.. భేష్.. అన్నారట కూడా.

ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ వ్యూహాలు చిత్రంగా వుంటాయి. కేసీయార్‌ని ర్యాగింగ్ చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘భుజం తట్టడం’ మోడీకి కొత్తేమీ కాదు. ఇప్పుడు నీతి అయోగ్ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా అందులో భాగమేనన్నది కొందరి వాదన.

ఆ సంగతి పక్కన పెడితే, అత్యంత బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నీతి అయోగ్ సమావేశంలో మాట్లాడారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ప్రధాని మోడీ అభినందించారట, వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారట. కానీ, పచ్చ బ్యాచ్‌కి వ్యవహారం వేరేలా అర్థమవుతోంది.