పవన్ సీఎం అవ్వాలి.. ఏపీ మంత్రికి మొదలైపోయింది.. క్లారిటీ వచ్చింది!

పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన అభిమానులు, కార్యకర్తలతోపాటు తాను కూడా కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేసిన మంత్రి పినిపే విశ్వరూప్ కు సెగ మొదలైపోయింది. దీంతో మంత్రి వివరణ ఇచ్చుకోవడంతోపాటు.. అతి లౌక్యం అవసరమన్నట్లుగా పరోక్షంగా స్పందించారు.

అవును… తాజాగా తిరుమలలో స్పందించిన ఏపీ మంత్రి విశ్వరూప్.. పవన్ ముఖ్యమంత్రి కావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో విశ్వరూప్ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం మాత్రం ఊపందుకుంది. ఆయన త్వరలో జనసేనలో జాయిన్ అవుతారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దీంతో మంత్రి మైకుల ముందుకు వచ్చారు.

తిరుమలలో పవన్ పై చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చుకున్న మంత్రి… ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీ మెజారిటీ తెచ్చుకోవాలని.. అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని చెబితే దాన్ని వక్రీకరించారని అన్నారు. ఇదే సమయంలో.. కోనసీమలో సామాజిక వర్గాలను సమన్వయం చేసుకున్నవారే రాజకీయం చేయగలరని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో జనసైనికులతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు, కాపు సామాజికవర్గ ప్రజల విషయంలో లౌక్యం ప్రదర్శించిన మంత్రి… ఓ వ్యక్తి అంటే కొంతమందికి ఆరాధ్య భావం ఉంటుందని.. ఆ వ్యక్తిని తిట్టి తానెందుకు ఆ కొంతమందికి విలన్ అవ్వాలని ప్రశ్నించారు. పరోక్షంగా తాను పవన్ ని విమర్శించనని చెప్పకనే చెప్పారు.

ఈ సమయంలో పార్టీ మారుతున్నారంటూ వస్తోన్న ప్రచారంపై కూడా మంత్రి స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన, అవసరం రెండూ లేవని స్పష్టం చేశారు. కోనసీమలో పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రపై స్పందించమంటేనే తాను తిరుమలలో మాట్లాడాను తప్ప.. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంలో నిజం ఏమాత్రం లేదని మంత్రి స్పష్టం చేశారు.

కాగా… ఇటీవల తిరుమల వెళ్లిన మంత్రి విశ్వరూప్.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులతో పాటు తానూ కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.