వైకాపా మంత్రివర్గంలో కొలువుదీరిన పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసారు. ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా పిల్లి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవికి సంబంధించి రాజీనామాను మండలి కార్యదర్శికి సమర్పించారు. అలాగే మంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. కాసేపట్లే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. గతనెల 19న పిల్లి సుభాష్ చంద్రబోస్ వైకాపా నుంచి రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేసారు. మరో మంత్రి మోపిదేవి వెంటకరమణ కూడా రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఆయన కూడా ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు. వీరిద్దరి రాజీనామాలతో మంత్రి పదవులు రెండు ఖాళీ అవ్వనున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా పనిచేసారు. అలాగే మత్స్య, పశుసంవర్థక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ పని చేస్తున్నారు. ఇప్పుడా ఆ రెండు పదవులు ఖాళీ అయిన నేపథ్యంలో వాటిని ఎవరితో భర్తీ చేస్తారు? అన్న దానిపై పొలిటికల్ కారిడార్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు, ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే యువ నేతల పేర్లు కూడా జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇలా ఆశావాహుల జాబితా పెద్దదిగానే ఉంది. ఆ రెండు పదవులు కూడా బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంతో ఇప్పుడు జగన్ అదే వర్గానికి కేటాయిస్తారా? లేక మరో స్ర్టాటజీతో ముందుకు వెళ్తారా? అన్నది చూడాలి.