జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ‘ప్లాన్-బి’ వుందా.?

ఓ వైపు రాజకీయాలు.. ఇంకో వైపు సినిమాలు.! ఇలా రెండు పడవల మీద ప్రయాణం అంత తేలిక కాదు.! ఓ పార్టీలో వుండడం వేరు.. ఓ పార్టీకి అధినేతగా వుండడం వేరు. ఓ పార్టీ అధినేత, సినిమాలు చేస్తూ.. రాజకీయాల్లో కొనసాగడమంటే చాలా చాలా కష్టమైన వ్యవహారమది. సినిమాలకు న్యాయం చేయలేక.. రాజకీయాలకూ న్యాయం చేయలేక.. రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది వ్యవహారం. రాజకీయాల గోల లేకపోతే, పవన్ కళ్యాణ్ నుంచి ఎడా పెడా సినిమాలు వచ్చేసేవి. అంత వేగంగా ఆయన సినిమాలకు కమిట్ అవుతున్నారు.

కమిట్ అవుతున్నారుగానీ, సినిమాలు చేయడంలో మాత్రం కమిట్మెంట్ చూపించడంలేదు. రాజకీయాల సంగతి కూడా అంతే. సినిమాల్లో సంపాదిస్తున్నారు, రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నారు. అది కాస్తా వృధా ప్రయాసగా మారిపోతోంది. దర్శకులు, నిర్మాతలు.. పవన్ కళ్యాణ్ డేట్లు అడ్జస్ట్ అవక నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. కానీ, చిత్రంగా పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు ప్రారంభమవుతూనే వున్నాయి.

ఇదంతా చూస్తోంటే, రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ వద్ద ‘ప్లాన్-బి’ కూడా వుండే వుంటుందనే అనుమానం ఎవరికైనా కలగడంలో వింతేమీ లేదు. 2024 ఎన్నికల్నీ పవన్ కళ్యాణ్ లైట్ తీసుకునే అవకాశం వుందట. 2024 ఎన్నికల్లో పలితాలు ఎలా వున్నా, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం తప్పనిసరి.

ఎటూ అధికారం దక్కే అవకాశం వుండదు. అసెంబ్లీకి వెళ్ళడం కంటే, రాజ్యసభకు వెళ్ళడం కంఫర్ట్.. అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. ఈ విషయమై బీజేపీ, టీడీపీ నుంచి వస్తున్న ప్రతిపాదనల్ని పవన్ పరిశీలిస్తున్నారట.