వైసీపీ నేత విజయసాయి రెడ్డి, శనివారం నాడు రాజ్యసభలో స్పీకర్ వెంకయ్య నాయుడిపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అటు అధికార పక్ష, ఇటు ప్రతిపక్ష సభ్యులు కూడా విజయసాయి రెడ్డి తీరు పై విరుచుకు పడ్డారు. ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు. పోయిన వారం జరిగిన చర్చలో, టిడిపి ఎంపీ కనకమేడల…హైకోర్టు తీర్పులోని 6093 అంటే జగన్ అని జడ్జి చెప్పారు అంటే ఎంత దౌర్భాగ్యం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యల పై ఈ రోజు విజయసాయి రెడ్డి రాజ్యసభలో అభ్యంతరం తెలిపారు. కనకమేడల చేసిన వ్యాఖ్యలు అభంతరకరం అని, ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరారు. అయితే ఈ సందర్భంగా పాయింట్ అఫ్ ఆర్డర్ అంటూ చెప్పుకొచ్చారు.
ఇది పాయింట్ అఫ్ ఆర్డర్ కింద రాదని, దీని పై రాత పూర్వక ఫిర్యాదు చేస్తే, నేను పరిశీలన చేసి, అభ్యంతరకరం అయితే తొలగిస్తానని వెంకయ్య చెప్పారు. పాయింట్ అఫ్ ఆర్డర్ అంటే అప్పుడే ఇవ్వాలని, నాలుగు రోజులు తరువాత ఇస్తే రూల్స్ ఒప్పుకోవని, ఫిర్యాదు చేయాలని వెంకయ్య సూచించారు. అయినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి వినకుండా, తన ప్రసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. చైర్మెన్ వెంకయ్య, మీరు ఫిర్యాదు ఇవ్వండి అంటూ, జీరో అవర్ ని కొనసాగించారు. అయితే, విజయసాయి రెడ్డి మాత్రం, వెంకయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. మీరు పక్షపాతంగా ఉంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు. టిడిపికి ఎక్కువ సమయం ఇచ్చి, మాకు తక్కువ సమయం ఇస్తున్నారు, మీ తనువు టిడిపితో ఉంది, మనసు బీజేపీతో ఉంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసారు.
ఈ సందర్భంలో కలుగచేసుకున్న కాంగ్రెస్, బీజేపీ సభ్యులు, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని, ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన వెంకయ్య, మీరు అందరూ నాకు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు. నేను పార్టీ పదవికి రాజీనామా చేసిన తరువాతే ఇక్కడ కూర్చున్నా అని గుర్తు చేసారు. నేను పక్షపాతంగా వ్యవహరిస్తున్నాను అని చెప్పిన మాటలు లెక్క చేయను కానీ వ్యక్తిగతంగ ఆ మాటలు బాధించాయని అన్నారు. మీరు ఫిర్యాదు ఇవ్వండి, చర్యలు తీసుకుంటా అని చెప్పిన తరువాత కూడా, ఇలా నా పై ఎందుకు నిందలు వేసారో అని బాధపడ్డారు. తన తనువు ఈ దేశంతో, రాజ్యాంగంతో ఉందని, వెంకయ్య అన్నారు. మొత్తానికి విజయసాయి రెడ్డి పై, రాజ్యసభ సభ్యులు అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు.