వివాదంగా మారిన పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ

తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ గందరగోళంగా మారింది. కీ పేపర్ , మార్కుల ప్రకటన లేకుండానే నియామకాలు చేపట్టడం పై అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ జాబితా అందరికి ఒకటే ప్రకటించకుండా ప్రతి జిల్లా కలెక్టరుకు సపరేట్ గా పంపించడం పై అనుమానాలున్నాయని అభ్యర్దులు అంటున్నారు. మొత్తం భర్తీ ప్రక్రియ పై అనుమానాలున్నాయని నియామకాలను వెంటనే నిలిపివేసి కీ పేపర్, మెరిట్ లిస్ట్ పెట్టాకే నియామకాలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి రాత పరీక్ష నిర్వహించారు. ఎన్నికల కోడ్, ఎన్నికలు జరగడంతో ఫలితాల విడుదల ఆలస్యమైంది. వాస్తవానికి ముందుగా కీ పేపర్ విడుదల చేసి  ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయాలి. అలా చేయకుండా నేరుగా మెరిట్ లిస్ట్ పెట్టారు. వారి మార్కులను కూడా విడుదల చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో 3 మార్కులు వచ్చిన వారికి కూడా జాబ్ వచ్చినట్టు లిస్ట్ లో పెట్టారు. యాదాద్రి జిల్లాలో 6 నంబర్లు మిస్ మ్యాచ్ అయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు నంబర్లు డబుల్ సార్లు వచ్చాయి. ఇలా అన్ని జిల్లాల్లో నియామకాలు అవకతవకగా మారాయి. 

మరో వైపు అర్హూల జాబితా ప్రకటించిన తెల్లారే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం పై విమర్శలు వస్తున్నాయి. ఒక్క రోజులోనే అన్ని సర్టిఫికెట్లు ఎలా తెచ్చుకుంటారని అభ్యర్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రక్రియను నిలిపివేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జాబ్ వచ్చిన వారికి కనీసం మెసేజ్ లు కూడా రాలేదని చాలా మందికి ఫలితాలు వచ్చాయన్న సంగతి కూడా తెలియదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఎంపికైన అందరికి కూడా మెసెజ్ లు రావాల్సి ఉందని ఇంత టెక్నాలజీ కాలంలో కూడా మూస పద్దతి అవలంబించడం పై అనుమానాలున్నాయన్నారు. ఫలితాలు తెలంగాణ అంతటా ఒకే సారి ప్రకటించాలి కానీ ఏ జిల్లాకు ఆ జిల్లా సపరేట్ పెట్టడం, ,ఒక్కో జిల్లాలో  ఒక్కో సమయాన పెట్టడం వివాదంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యార్ధి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ తెలుగు రాజ్యంతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయి. కీ పేపర్ లేకుండా మెరిట్ లిస్టు ఎలా పెడుతారు. అన్ని కలిపి ప్రకటించాల్సిన ఫలితాలను ముందుగానే జిల్లాల వారిగా కలెక్టర్లకు ఎందుకు పంపించారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ ప్రకటించాలి. చాలా జిల్లాలలో వచ్చిన నంబర్లే రెండు సార్లు వచ్చాయి. భర్తీ ప్రక్రియను వెంటనే నిలిపి వేసి పారదర్శకంగా చేయాలి. ఫలితాలు ప్రకటించిన తెల్లారే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటే అది సాద్యమయ్యే పనేనా. అందరి దగ్గర అన్ని సర్టిఫికెట్లు ఉండవు కదా. దేశ చరిత్రలోనే ఇటువంటి రిక్రూట్ మెంట్ చూడలేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం ఓయూలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అటు నుంచి నేరుగా హైకోర్టుకు వెళ్లి దీని పై అత్యవసర పిటిషన్ వేస్తాం.” అని తెలిపారు.

మొత్తానికి పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ వివాదంగా మారింది. కొందరు అభ్యర్ధులు ఈ వివాదం పై స్పందించాల్సిందిగా విపక్ష నేతలను కలిసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు దీని పై నేడు స్పందించనున్నారని తెలుస్తోంది.  ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.