08:24:29అమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాను గుర్తు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఆ సినిమాలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేశ్ బాబు పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. అందులో ముఖ్యమైన వాటిలో ట్రాఫిక్ రూల్స్ కూడా ఉంది.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని నియంత్రించేందుకు భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ చలాన్లను భారీ స్థాయిలో విధించాలని ఆదేశాలు జారీ చేస్తారు సీఎం మహేశ్. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా ఇప్పుడు ఇదే విధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి భారీ జరిమానాలను విధిస్తోంది.
అయితే, ఈ చర్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలపై మండిపడ్డారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానాలు వేయాలని జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగిస్తుంటే.. కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా సంస్థలు మాత్రం విమర్శిస్తున్నాయని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో 31 సవరణలు చేసిందని, దానిలో 20 సెక్షన్స్ అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని మంత్రి తెలిపారు. మిగితా 11 సెక్షన్స్‌లో రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చిందని గుర్తు చేశారు. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు.
ఇష్టారీతిన వాహనాలు నడిపితే చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. ఫిట్నెస్ లేని వాహనాలను వదిలేయాలా? అని నిలదీశారు. ముందు గోతులు పూడ్చండి తర్వాత ఫైన్లు వేయాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుననారని.. భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. గుంతలుపడితే వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడిపించొచ్చా? అని ప్రశ్నించారు. భరత్ అనే నేను సినిమా చూసి చప్పట్లు కొడతారు.. కానీ, అలా నిజ జీవితంలో చేస్తే సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తారా? అని నిలదీశారు. 21 సెక్షన్ల మినహాయింపుపై విన్నపాలు వస్తున్నాయని, దీనిపై కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఫైన్లు వేయడం లేదని.. తప్పు చేయకుండా ఉండటానికేనని స్పష్టం చేశారు మంత్రి పేర్ని నాని.