పచ్చ పువ్వులతో నిండిపోయిన ఏపీ బీజేపీ… పేర్ని నాని సెటైర్స్ పీక్స్!

నరేంద్ర మోడీ పాలన 9 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డాన్ని పుర‌స్క‌రించుకుని బీజేపీ చేపట్టిన “జనసంపర్క్‌ అభియాన్‌”లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకున్న పరిపూర్ణమైన అవగాహనా లోపంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో తాజాగా నడ్డా వ్యాఖ్యలు, అందుకు కారణమైన వారి కామెంట్లపై పేర్ని నాని ఫైరయ్యారు!

శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపైనా, జగన్ పాలనపైనా విమర్శలు చేసిన జేపీ నడ్డాపై మాజీమంత్రి పేర్ని నాని కౌంటర్స్ వేశారు. “కర్ణాటకలో బీజేపీ కుక్క చావు చచ్చింది.. నడ్డా మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుంటుంది.. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారు” అంటూ ఫైరయ్యారు పేర్ని నాని. “మనువు బీజేపీతో మనస్సు చంద్రబాబు”తో ఉన్న సీఎం రమేష్, సత్య కుమార్, సుజనా చౌదరి వంటి వారి మాటలను నడ్డా చెవికెక్కించుకుంటే అది ఆయన ఖర్మ అని పేర్ని తేల్చేశారు!

ఇక ఏపీలో ల్యాండ్ స్కాం జరుగుతుంది అని నడ్డా వ్యాఖ్యానించడంపైనా పేర్ని ఫైరయ్యారు. విశాఖ ఉక్కు పీక కొద్దామనే ఆలోచన వెనుక విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేట్ వారికి ఇచ్చేస్తారేమోననే అనుమానం ఉంది అని పేర్ని నాని అన్నారు. అది బీజేపీ మార్కు ల్యాండ్ స్కాం అని.. జగన్ పాలనలో అలాంటివాటికి చోటు ఉండదని తేల్చి చెప్పారు. అమరావతిలో ల్యాండ్ స్కాం అంటున్న బీజేపీ నేతలు.. 2014-19 మధ్యకాలంలో టీడీపీతో కలిసి మింగేసిన భూముల వివరాలపై మాట్లాడాలని సూచించారు.

ఇదే సమయంలో… “రాజధానికి డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారని మీరే చెప్పారు. ఇసుక ప్రీ అంటూ టీడీపీ, బీజేపీ పెద్దలు దోచుకున్నారు. మీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలి” అంటూ పేర్ని నాని కామెంట్స్ చేశారు.

అనంతరం…. “జగన్ ప్రభుత్వం రూ. 2.16 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేసింది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేం చేస్తున్న సంక్షేమంలో సగమైనా చేశారా..? ఆ చరిత్ర మీకుందా..?” అంటూ ప్రశ్నించారు నాని. ఇదే సమయంలో “వాస్తవాలు తెలుసుకోకుండా… పచ్చ పువ్వుల మాటల విని మాట్లాడ్డం సరికాదు నడ్డాజీ” అంటూ పేర్నినాని సూచించారు.

ఏపీ బీజేపీ మొత్తం పచ్చ పువ్వులతో నిండిపోయిందని, జగన్ సర్కార్ పై బురదల జల్లడం, చంద్రబాబు మేలు కోరడమే వారి పని అని.. అలాంటి వారి మాటలు నడ్డా వినడం ఆయన ఖర్మ అని పేర్ని నాని స్పష్టం చేశారు.