వైఎస్ జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందనేది వాస్తవం. జగన్ ఏం చేయాలన్నా ఈ కోటరీలోని నేతలు సలహాలు, సూచనలు తీసుకుంటుంటారు. జగన్ ముందు చెల్లుబాటయ్యేది కూడ వీరి మాటే. ఆ కోటరీలో అతి ముఖ్యమైన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ ఎవరి మాటైనా వింటారు అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట మాత్రమే. అందుకే పార్టీలో ఆయన్ను జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తి అంటుంటారు. ఈయన మిగతా కోటరీ నాయకుల తరహాలో ఎక్కువగా బయటపడటానికి ఇష్టపడరు. కానీ చేయాల్సిందంతా లోపలే చేస్తుంటారు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటలాంటి రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ప్రాభవం ఎక్కువగా ఉంటోంది. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా మొత్తాన్ని మడిచేసి జగన్ జేబులో పెట్టడంలో పెద్దిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర్నుండి, ఎన్నికల నిర్వహణ వరకు అంతా ఆయన చేతుల మీదుగానే జరిగింది. ఆయన వేసిన ప్రతి ఎత్తూ ఫలించింది. అందుకే ఆయన మాటంటే జగన్ కు అంత గురి.
అయితే ఈ నమ్మకం మిగతా నేతలకు సంకటంగా మారిందని వైసీపీలో చెప్పుకుంటున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. జిల్లాలోని ప్రతి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిగారి కనుసన్నల్లోనే ఉండాలనేది రూల్. చీమ చిటుక్కుమనాలన్నా పెద్దిరెడ్డి పర్మిషన్ అవసరం. ఎమ్మెల్యేలు ఏం చేయాలనుకున్నా ముందుగా పెద్దిరెడ్డి నోటీసుకు వేలి అనుమతులొచ్చాకే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అధికారుల మార్పులు చేర్పులు, పార్టీలోని పదవుల కేటాయింపుల సంగతే కాదు నియోజకవర్గంలో ఏ కార్యక్రమ పెట్టుకోవాలనుకున్నా పెద్దాయన అనుమతి తప్పనిసరి. కాదని మీరితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
అందుకు ఉదాహరణే ఎమ్మెల్యే ఆర్కే రోజా. రోజాకు జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. సామాజికవర్గాల సమీకరణాల దృష్ట్యా ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు కానీ లేకుంటే మంత్రి అయ్యేవారే. ఆమెకు పదవి ఇవ్వలేనందుకు జగన్ సైతం చాలా ఫీలయ్యారు. అలాంటి రోజానే పెద్దిరెడ్డి దెబ్బకు బెంబేలెత్తుతున్నారు. రోజా తన నియోజకవర్గంలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల్లో ఉంటారు. కరోనా సమయంలో కూడ ప్రారంభోత్సవాలంటూ హడావుడి చేశారు. అలాంటి ఆమె ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అందరిలా ఆమె పెద్దిరెడ్డి వద్ద పర్మిషన్ తీసుకునే సంప్రదాయాన్ని పాటించలేదు. తన పనేదో తనది అన్నట్టు ఉండేవారు. అదే పెద్దిరెడ్డికి నచ్చలేదు. ఎలాగైనా ఆమె స్పీడుకు బ్రేకులు వేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ప్రత్యర్థి వర్గాన్నే ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోజా సైలెంట్ అయ్యారు.
అలాంటి పరిస్థితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఎదురైంది. మధుసూదన్ నిజానికి పెద్దిరెడ్డికి అనుంగ శిష్యుడు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇప్పించి గెలిపించింది ఆయనే. తనవాడు, తాను చెప్పినట్టు వింటాడనే ఉద్దేశ్యంలో పెద్దిరెడ్డి ప్రోత్సహించారు. కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఉత్సాహం వల్లనో ఏమో కానీ మధుసూదన్ పెద్దిరెడ్డి ఆదేశాలను పక్కపెట్టి వ్యవహరించారు. నియిజకవర్గంలో ఏదైనా చేయాలంటే తనకు చెప్పే చేయాలనే పెద్దిరెడ్డి షరతును పాటించలేదు. కరోనా సమయంలో బియ్యం పంపిణీ, ట్రాక్టర్ ర్యాలీతో మధుసూదన్ చేసిన హడావుడి పెద్ద దుమారమైంది అప్పుడే హెచ్చరించిన పెద్దిరెడ్డి ఇకపై ఏం చేసినా చెప్పి చేయమని మరోసారి చెప్పారట. మధుసూదన్ జగన్ పాదయాత్ర మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా సభలు, ర్యాలీలు పెట్టారు. ఇదంతా పెద్దాయనకు చెప్పకుండా చేసిందే.
దీంతో తీవ్రంగా నోచుకున్న పెద్దిరెడ్డి రోజాకు ఇచ్చిన ట్రీట్మెంట్ మధుసూదన్ రెడ్డికి కూడ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఆయన ప్రత్యర్థిని వెతకడం స్టార్ట్ చేశారట. ఈ క్రమంలో టీడీపీ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి మీద ఆయన దృష్టి పడిందట. మధుసూదన్ రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తున్నారట. ఈమేరకు చర్చలు కూడ మొదలయ్యాయట. ఈ సంగతి మధుసూదన్ రెడ్డికి కూడ తెలుసని, కానీ ఎలాంటి సయోధ్యకు ట్రై చేయట్లేదని చెబుతున్నారు. మరి కోటరీ పెద్ద నుండి మధుసూదన్ ఎలా తప్పించుకుంటారో చూడాలి.