నా పెళ్లిళ్ల వల్లే జైలు కెళ్లావా జగనన్నా, నోరు అదుపులో పెట్టుకో

తన పెళ్లిళ్ల గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత విషయాల మీద వైసిపి పార్టీ నాయకులు నోటికొచ్చి మాట్లాడుతున్నారని ఇలా మరొక సారి ఇలా చేస్తే వారందరని రోడ్డుపైకి తెచ్చి నిలబెడతానని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో ఐదోరోజు ప్రజా పోరాటయాత్ర భాగంగా ఆయన గురువారం సాయంత్రం గుంతకల్లులో ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. జ్వరంతో బాధ పడుతున్నా లెక్క చేయకుండా ఆయన తన యాత్ర కొనసాగించారు. గుంతకల్లులో మూతబడిన ఏసీఎస్‌ మిల్లు ఎదుటే బహిరంగ సభను నిర్వహించారు. అంతకుముందు అనంతపురంలో విలేకరులతో కూడా మాట్లాడారు.

‘జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి తో హత్యాయత్నం దాడి జరిగితే టీడీపీవారు ఆయన తల్లిపై అభాండాలు వేశారు. నేను తీవ్రంగా వ్యతిరేకించాను. జగన్‌ తల్లిని నేను గౌరవించాను. కానీ జగనేమో ఆయన నా వివాహాలను అడ్డుపెట్టుకుని తిడుతున్నారు.

“నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్రం విడిపోయింది, నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగింది, నా పెళ్లిళ్ల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లారు.”

వైసీపీ నాయకులు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మీ ఒక్కొక్కరి వ్యక్తి గత జీవితాన్ని రోడ్డు మీదకి లాగగలను, కానీ మా అమ్మ గారు నన్ను చాలా సంస్కారం తో పెంచారు.అలా చెయ్యడానికి నా సంస్కారం అడ్డువస్తోందని చెప్పారు.

ఈ ధోరణి నిగే తీవ్రదుయ్యబడుతూ రేపు వైసీపీకి ఓటేయకుంటే ప్రజలను కూడా ఇలాగే తిడతారా అన్నారు.
‘నేను తెగించి వాడిని. అందరికంటే ఎక్కువ తెగించాను. అధికార, ప్రతిపక్ష పార్టీలను ఎదిరించడానికి రోజూ చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతున్నా. తనను సీఎం చేసేంతవరకూ ఏమీ చేయనని జగన్‌ అంటున్నారు. మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు అడుగుతున్నారు. అయితే, వీరికి ప్రజల ఆకాంక్షలు మాత్రం వీరికి పట్టడంలేద.’ అని విమర్శించారు.

రాయలసీమ దుస్థితి

రాయలసీమ నుంచి ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇక్కడి దుస్థితిని మాత్రం మారకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెయిన్లతో కరువు మీద యుద్ధం చేసి జయించానని చేస్తున్న ప్రకటనను ప్రస్తావిస్తూ, రెయిన్‌గన్లకు రూ.300 కోట్లు, కుంటల కోసం రూ.1000 కోట్లు ఖర్చుచేశారని ఫలితమేది అని అన్నారు.

పర్సెంటేజీల కోసమే ఈ హంగామా చేశారని, వాటిని అప్పటికప్పుడు అట్టహాసంగా వాడి తర్వాత పక్కన పడేశారని ఆరోపించారు.
అంతాఅనుకుంటున్నట్లు రాయలసీమది ముఠా సంస్కృతి కాదని అంటూ తరిమెల నాగిరెడ్డి, వీరబ్రహ్మం, వెంగమాంబ, కట్టమంచి లాంటి ఆదర్శవంతులెందరో వచ్చింది రాయలసీమ నుంచే నని ఆయన గుర్తు చేశారు. ‘గుంతకల్లులో ఏసీఎస్‌ మిల్లు మూతబడి ఉపాధి పోయి ఎందరో రోడ్డుమీదపడ్డా ఏ ఒక్క ప్రభుత్వమూ తెరిపించలేకపోయింది. చంద్రబాబుకు రాయలసీమ పౌరుషమే ఉంటే మిల్లును తెరిపించాలి, కార్మికుల బకాయిలు చెల్లించాలి. ఆయన చేయలేకపోతే నేను అధికారంలోకి వచ్చాక తెరిపిస్తాను. గుంతకల్లులో మరిన్ని పరిశ్రమలను నెలకొల్పుతాను. జగన్ గారూ మీ పౌరుషమేదో ఈ మూతపడిన మిల్లుల మీద చూపి తెరిపించండి, చూద్దాం,’ అని అన్నారు.

రాజకీయాలు సినిమా కాదు

‘ఎమ్మెల్యేలు అంతా వెళ్లిపోయినా చివర నాయకుడు ఒంటరి అయినా తెగించి పోరాటం చేయాలి. నా పార్టీ ఎమ్మెల్యేలంతా టీడీపీలోకి వెళ్లిపోయారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రశ్నించేదెవరు’ అని పవన్‌ అంతకుముందు అనంతపురంలో అన్నారు. ‘ఎమ్మెల్యేలను రూలింగ్ పార్టీ వారు కొన్నారని పంతానికి పోయి అసెంబ్లీకి వెళ్లబోమంటే ఎలా? పంతాలకు పట్టింపులకు పోవడానికి ఇదేమన్నా సినిమానా? అనుమానం లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబు చేసిన నీచమైన పనే . గతంలో వైఎస్‌ అధికారంలో ఉన్నపుడూ అదేపని చేశారే,’ అని ఆయన గుర్తు చేశారు.