వైసీపీని ఓడించడమేనా.? జనసేన గెలిచేదేమన్నా వుందా.?

మళ్ళీ అదే తప్పు.! మళ్ళీ మళ్ళీ అదే తప్పు.! జనసేన పార్టీకి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టుంది. అన్నీ గెలిచేంత ‘పట్టు’ కాదుగానీ, ఒకటో, రెండో గెలిచే ఛాన్సుంది. లక్కు కలిసొస్తే, ఓ ఐదారు గెలవొచ్చు. మొత్తంగా ముప్ఫయ్‌కి పైగా నియోజకవర్గాలున్నాయి ఈ పరిధిలో.

కాస్త ఫోకస్ పెడితే, డబుల్ డిజిట్ చేరుకునే అవకాశం వుంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి. కానీ, ఏం లాభం.? గెలిచేందుకు జనసేన ప్రయత్నించడంలేదు. వైసీపీని ఓడించడం మీద ఫోకస్ పెట్టింది.

‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలవనివ్వను..’ అని 2019 ఎన్నికల్లో నినదించారు పవన్ కళ్యాణ్. ‘నేను గెలుస్తాను..’ అని ఒకవేళ జనసేనాని గట్టిగా నినదించగలిగి వుంటే, ఆ లెక్క వేరేలా వుండేది. ఇప్పుడూ అదే తప్పు చేస్తున్నారాయన.

‘ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో ఒక్కటీ వైసీపీ గెలవకూడదు..’ అని అంటున్నారు. వారాహి యాత్రలో భాగంగా స్థానిక నాయకులతో జనసేనాని చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. హాస్యాస్పదంగానూ మారుతున్నాయి.

ఎందుకిలా.? ఇదే వ్యూహాత్మక తప్పిదం. కాదు కాదు అవగాహనా రాహిత్యం. అన్నిటికీ మించి అహంకారం, దానికి తోడు మూర్ఖత్వం.. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

గెలిచేంత ఛరిష్మా వున్నా, పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడానికి కారణమిదే.!