షాకింగ్ న్యూస్: విలీనం దిశగా జనసేన..?

“ప్రజారాజ్యం రాజకీయ కూడలిలో నిలబడింది. తొలి పుట్టినరోజు పూర్తిచేసుకోకముందే తన పయనమెటో తేల్చుకోవాల్సిన సంకట పరిస్థితిని ఎదుర్కొంటుంది. అధికారపార్టీ పాత్ర నిర్వహించే అవకాశం కనుచూపుమేరలో కనబడటం లేదని భావిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు.. ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేద్దామని ప్రతిపాదించారు”… ప్రజారాజ్యం విషయంలో “జెండా పీకేద్దాం!”అనే శీర్షికతో నాడు ఒక వర్గం మీడియా రాసిన “కథ”నం! అయితే తాజాగా జనసేన విషయంలో కూడా అలాంటి కథనాలే వండి వడ్డిస్తున్నారు!

అవును… ఇప్పటికే కేసీఆర్.. జనసేన అధినేత పవన్ కు రూ.1000 కోట్లు ఆఫర్ చేశారని బురద జల్లడం, జనసేన లెవెల్ తగ్గించే ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టేసింది ఒక వర్గం మీడియా! “బాబుతో ఉంటేనే బ్రతకనిద్దాం.. లేదంటే జెండా పీకించేద్దాం” అన్నట్లుగా సాగుతున్న వ్యవహారంలో భాగంగా.. మరో అడుగు ముందుకేసింది. జనసేన ను బీజేపీలో విలీనం చేసేయాలని ఆఫర్ వచ్చినట్లు రాసుకొచ్చింది!

అవును… పొత్తుల విషయం గురించో.. లేక, రోడ్ మ్యాప్ కోసమో తెలియదు కానీ ఈ మధ్యనే హడావుడిగా ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలను కలసి వచ్చారు. అయితే అక్కడ ఏమీ సరైన పరిష్కారం అయితే దొరకలేదన్న విషయం.. మీటింగ్ అనంతరం పవన్ ప్రెస్ మీట్ చూస్తే అర్ధమవుతుంది. ఆ సంగతి అలా ఉంటే… ఆ మీటింగ్ లో బీజేపీ నేతలు కొంతమంది.. “మీరు పార్టీని నడపలేకపోతున్నారు. మీ పార్టీని బీజేపీలో కలిపేయండి.. మేము పూర్తిగా సహకరిస్తాం.. కావాల్సినంతగా హెల్ప్ చేస్తాం” అని అన్నట్లు హస్తిన స్థాయి రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుందంటూ… కథనాలు రాసేసింది ఒక వర్గం మీడియా!

అది కూడా సరైన నిర్ణయమే అంటూ… ఆ కథనానికి న్యాయం చేశే దిశగా తన వెర్షన్ వినిపించిన ఆ మీడియా… ఈ విధంగా రాసుకొచ్చింది. “పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు అయింది. ఈ రోజుకీ ఆయన కూడా గెలవలేదు.. ఆయనకంటూ పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా చూసుకోలేదు. పార్టీలో నాయకులను చూస్తే తిప్పి తిప్పి కొట్టినా నాదెండ్ల మనోహర్ తప్ప ఎవరూ కనిపించడంలేదు.. మరి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరే ఎక్కడ పోటీ చేస్తారు అనే విషయంలో క్లారిటీ లేకపోతే.. క్యాడర్ కి ఏమి చెబుతారు?” అనేది ఆ మీడియా వెర్షన్!

ఈ స్థాయిలో జనసేనపై మొదలైపోయినా దాడి విషయంలో పవన్ ఇప్పటికైనా స్పందిస్తారా.? ఎన్నికలు సమీపిస్తుంటే.. మరో వైపు మిగిలిన రాజకీయ పార్టీలు హడావిడిగా పనులు చక్కబెట్టుకుంటుంటే… పవన్ మాత్రం షూటింగుల్లో బిజీగా ఉంటున్నారంటూ వస్తున్న విమర్శలపై మాట్లాడతారా? లేక, ఒక వర్గం మీడియా రాస్తున్నట్లో.. ఆశిస్తున్నట్లో… “జెండా పీకేస్తారా” అన్నది వేచి చూడాలి!

వాళ్లూ వీళ్లూ అన్నారని కాదు కానీ… ఇప్పటికీ పవన్ లో పరిపూర్ణమైన పొలిటీషియన్ కానీ, జనసేనను ఒక పక్కా రాజకీయపార్టీగా నడపడం కానీ చేయడం లేదు అనేది… జనసైనికులే ఆఫ్ ద రికార్డ్ చెబుతుంటారు. ఎవరు ఏమనుకున్నా.. ఎన్ననుకున్నా.. పవన్ మాత్రం మారడం లేదు. నమ్ముకున్న సైనికులను నట్టేట ముంచేలానే ప్రవర్తిస్తున్నారు!!