పవన్ కళ్యాణ్ వీకెండ్ రాజకీయం ఎన్నాళ్ళు.?

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారంటూ అధికార వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి, పవన్ కళ్యాణ్ గతంలో అయితే, మూడు నెలలకో.. ఆరు నెలలకో ఓ సారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించేవారు. ఇప్పుడు ప్రతివారం కనిపిస్తున్నారు. సో, జనసేన పార్టీకి సంబంధించినంతవరకు ఇది చాలా పెద్ద మార్పుగానే చెప్పుకోవాలి.

గ్రామగ్రామాన జనసైనికులు యాక్టివ్‌గా పనిచేస్తున్నమాట వాస్తవం. చాలా చోట్ల అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో జనసేన బలపడింది. ‘మేం ఎవరికైనా సీట్లు ఇచ్చే స్థానంలో వుంటాం..’ అని ఆ మధ్య జనసేన నేతలు చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే, జనసేననే టీడీపీకి సీట్లు ఇచ్చే స్థాయిలో వుండాలన్నది జనసేన అధినేత ఉద్దేశ్యం కావొచ్చు.

సరే, ప్రస్తుతానికైతే జనసేన పార్టీ తమది ఒంటరి ఎజెండా అంటోంది. ఆ దిశగానే జనసేనాని, గత బంధాల్ని తెగ్గోసుకుంటున్నట్లే కనిపిస్తోంది కూడా. ఇక, వీకెండ్ రాజకీయం.. అంటూ అధికార వైసీపీ చేస్తున్న విమర్శలకు జనసేన నేతలూ గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు.

‘విజయదశమి వరకే మీ వాగుడు.. ఆ తర్వాత మీ నోళ్ళు మూతపడ్తాయ్..’ అంటూ అధికార పక్షంపై కౌంటర్ ఎటాక్‌కి దిగుతోంది జనసేన. విజయదశమి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని యాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. అదెలా వుండబోతోందన్నదానిపై ప్రస్తుతానికి జనసేన పెదవి విప్పడంలేదు.

వీకెండ్ రాజకీయం కాకుండా, పూర్తిగా ఎన్నికలయ్యేదాకా జనసేనాని జనంలోనే వుండగలుగుతారా.? వుంటే మాత్రం.. జనసేన పుంజుకోవడం ఖాయమే. కానీ, అంత ఓపిక జనసేనానికి వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.